నందిపేట్/మాక్లూర్/చందూర్, జనవరి 8: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా నందిపేట్, మాక్లూర్, చందూర్ తదితర మండలాల్లో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు బీఆర్ఎస్ నేతలతో కలిసి మాక్లూర్, నందిపేట్ మండలాల తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం విఠల్‌రావు మాట్లాడుతూ.. రైతులందరికీ రుణమాఫీ చేయలేదని, రైతుబంధును ఎగ్గొట్టిందని విమర్శించారు. అన్ని పంటలకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఇవ్వలేదని, మహాలక్ష్మి పథకం ఊసే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రైతులను నిలువునా దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ సర్కారు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదని, ప్రభుత్వం హామీలను అమలు చేసే దాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు రమణారావు, మచ్చర్ల సాగర్, అంజయ్య, భరత్, శ్రీనివాస్, అశోక్‌రావు, మల్లారెడ్డి, శ్యామ్‌రావు, రఘురావు, తిరుమల నర్సాగౌడ్, దర్గాల సాయిలు , అంజయ్య, తాజుద్దీన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ముందర కాంగ్రెస్ చెప్పినట్లు రైతుభరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని, సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చందూర్‌లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. రైతు బాగుండాలంటే కేసీఆర్ రావాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలనలో కాలయాపన తప్ప రైతులకు, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ నేత మాధవరెడ్డి, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.