కోటగిరి/రుద్రూర్, ఏప్రిల్ 20: బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తనను నమ్ముకొని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారని, వారి బాధను తాను చూడలేనన్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు బిల్లులు రాకపోతే మే 13 తర్వాత లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని స్పష్టం చేశారు. అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే తాను ప్రాణత్యాగం చేస్తానని, తనకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పొతంగల్, కోటగిరి, రుద్రూర్లో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి తుంగలోకి తొక్కేశాడని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గాలి అనిల్‌కుమార్‌ను గెలిపిస్తే పార్లమెంట్లో మన సమస్యలపై పోరాడుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా సురేశ్ షెట్కార్ ఐదేండ్లు పనిచేసినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. మరో పదేండ్లు బీబీ పాటిల్ ఎంపీగా ఉన్నా నియోజకవర్గానికి ఆయన చేసింది శూన్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, గంగాధర్, లక్ష్మణ్, సిద్దూ, హామీద్, జుబేర్, శంకర్, విఠల్, సాబేర్, గుడూ, నబీ, జుమ్మాఖాన్ పాల్గొన్నారు.