బోధన్, ఏప్రిల్ 5: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాలూరా మండలంలోని హున్సా, ఖాజాపూర్, మంధర్నా గ్రామ శివారుల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. వరి, అరటి, మామిడి పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన ఆయా గ్రామాల్లో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. ఎక్కడా ఆ దాఖలాలు లేవని విమర్శించారు. వర్షాలకాలంలో సైతం పంట నష్టం జరిగినా, వివరాలు సేకరించినా ఇంతవరకూ ఒక్క రూపాయి కేటాయించలేదని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు నష్టం జరిగినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
వడగండ్ల వాన కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగినా, ఇప్పటి వరకు కలెక్టర్ గాని, సంబంధిత అధికారులు గాని స్పందించలేకపోయారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, గోగినేని నర్సయ్య, పల్లెంపాటి కృష్ణ ప్రసాద్, నాగరాజు, వెంకట్ రెడ్డి, భవానీ పేట్ శ్రీనివాస్, హనుమంతు తదితరులు ఉన్నారు.