రామారెడ్డి, నవంబర్ 21: ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ సమస్యలను మంత్రి సీతక్కకు చెప్పుకుందామనుకున్న రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నించారు. రామారెడ్డి మీదుగా సిరికొండకు వెళ్తున్న జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని రామారెడ్డిలో రైతులు కలిసి, బోనస్ ఇవ్వాలని, ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడానికి ప్రయత్నించగా..
మంత్రి అసభ్యంగా మాట్లాడిన తీరును ఆయన ఖండించారు. రామారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. బాధిత రైతులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ నాయకులకు కేవలం ఎన్నికల సమయంలోనే రైతులు గుర్తుకు వస్తారని, మిగిలిన సమయంలో వారిని పట్టించుకోరన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని, సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలన్నారు.