ఎల్లారెడ్డి రూరల్, జనవరి 6: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను వెంటనే అమలుచేయాలని డి మాండ్ చేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణం వద్ద ప్రధాన రహదారిపై చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో రైతుబంధును కొనసాగిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. పోయిన వాన కాలం పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
యాసంగి పంట పూర్తయినా ఇప్పుడు కూడా ఇంకా రైతుబంధు ఇవ్వలేదని, ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గుర్తించాలని కోరారు. రైతు భరోసాకు ఇప్పుడు ఎకరానికి రూ. 6వేలు ఇస్తానని కొత్తపాట మొదలుపెట్టిండని విమర్శించారు. కేసీఆర్ రెండు పంటలకు రైతుబంధు ఇస్తే, తాను మూడు పంటలకు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క పంటకు ఇచ్చిందిలేదన్నారు. ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి ఝాటారెడ్డి అబద్ధపు హామీలేనన్నారు.
క్వింటాలుకు ఇస్తానన్న రూ. 500 బోనస్, మహిళలకు రూ.2,500 ఏమ య్యాయని ప్రశ్నించారు. బస్సుల సంఖ్యను తగ్గించి ఉచిత బస్సు పథకాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నా రు. ఏ సొసైటీ, ఏ బ్యాంకులో చూసినా ఇప్పటివరకు రైతురుణమాఫీ 50శాతం కూడా పూర్తికాలేదన్నారు. రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగి తీరాల్సిందేనని అన్నారు. ఇందిర మ్మ ఇండ్లు ఇస్తానని అబద్ధపు మాటలు చెప్పి 15నెలలు అవుతున్నా, ఏ ఒక్కరికీ ఇచ్చింది లేదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని కాంగ్రెస్ నాయకులు తప్పు ఒప్పుకొని ముక్కును నేలకు రాసి గ్రామాల్లోకి అడుగుపెట్టాలన్నారు. అధికారంలో ఉ న్నా, లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు జలంధర్‌రెడ్డి, ఆదిమూలం సతీశ్‌కుమార్, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, నాగిరెడ్డిపేట్ మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, నాయకులు కపిల్‌రెడ్డి, కిష్టారెడ్డి, నాగం రాజయ్య, నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.