ఇలా ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఎన్నికలు ముగియగానే మాట మార్చారు. సన్న వడ్లు పండించిన వారికే బోనస్ అంటూ రిక్తహస్తం చూపించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
గులాబీ బాస్ కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో రైతులు, పార్టీ శ్రేణులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అన్నిరకాల వడ్లకు బోనస్ ఇచ్చే వరకూ రైతులకు మద్దతుగా పోరాడుతామన్నారు. కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మేయర్ దండు నీతూకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి, మే 16: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామనడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేయడం సిగ్గుచేటన్నారు. 55ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలను మోసం చేస్తూ వస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రైతులకు అండగా ఉంటామన్నారు. వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చే వరకూ పోరాటం ఆగదన్నారు. వచ్చే ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ కూడా చేయాలని డిమాండ్ చేశారు.
– గంప గోవర్ధన్, మాజీ విప్
ఖలీల్వాడి, మే 16: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్లు కొనకుండా చోద్యం చూడడంతోనే అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు గుండెలు బాధుకుంటున్నారని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర్ మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. మొన్నటి వరకు బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మాట మార్చారని, సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి వడ్లబస్తాలు ఉంటున్నా ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట.. ఎన్నికలు ముగిసిన తర్వాత మారిందన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసిన పాపాన ప్రజలు, రైతులను తీవ్ర సంక్షోభంలో పడేశారన్నారు. రైతులు పండించిన అన్నిరకాల పంటలకు బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
-జడ్పీ చైర్మన్ విఠల్రావు, మేయర్ దండు నీతూ కిరణ్