కామారెడ్డి, ఆగస్టు 22: ఎన్నికల్లో చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రుణమాఫీ చేయలేదని, ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు డిక్లరేషన్ పేరిట రూ.2లక్షలు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా సంపూర్ణంగా మాఫీ చేయలేదని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రముఖ దేవాలయాల మీద ఒట్టువేసి ఓట్లు వేయించుకొని ఇచ్చిన హామీని మరిచిపోయారని అన్నారు. అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి.. నోరా అది తాటిమట్టనా అని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇకనైనా అందరికీ రుణమాఫీ చేయాలని లేదంటే బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు గోపీగౌడ్, కుంబాల రవియాదవ్, కౌన్సిలర్లు, నాయకులు
పాల్గొన్నారు.