సారంగాపూర్, మార్చి 30: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి, అమలు సాధ్యం కానీ హామీలను ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు.. అధికారం చేపట్టాక వాటి ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడు, సొసైటీ మాజీ డైరెక్టర్ అరవింద్ నాయక్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి చేరారు. నిజామాబాద్‌లోని బాజిరెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి జగన్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికీ వాటిని అమలు చేయడం లేదని బాజిరెడ్డి విమర్శించారు. రెండున్నరేండ్ల నుంచి కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మాత్రమే మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కొత్తగా నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు.
ఏడాది క్రితం గ్రామా ల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు వేసిన శిలాఫలకాలు.. నిధుల్లేక, పనులు ప్రారంభం కాక ఇప్పటికీ వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒకవైపు నిధులు మంజూరు కాక ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.
భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని, అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని బాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో లేమని అధైర్యపడొద్దని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. మరో రెండేండ్లు ఓపిక పడితే, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో స్వర్ణయుగం వస్తుందన్నారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, మాజీ జడ్పీటీసీ బోల్లెంక గోపాల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు అశోక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్, మాజీ ఎంపీటీసీ గంగారాంనాయక్, నాయకులు శ్రీనివాస్‌రావు, రాంగోపాల్‌రెడ్డి, కృష్ణ, రమేశ్‌నాయక్, గంగ్య పాల్గొన్నారు.