కోటగిరి, జూన్ 11: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రేవంతుది రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. అన్ని వర్గాల వారిని కష్టాలపాలు జేస్తున్నదని, రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో గురువారం బీఆర్ఎస్ సభ్యత్వ నమో దు, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బాజిరెడ్డి గోవర్ధన్, సభ్యత్వ నమో దు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి తోట ఆగయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరు గ్యాంరెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలపై పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలన రైతుల రోదనలు, నిరుద్యోగుల ఆక్రందనలు, హామీల ఎగవేతల మీద కొనసాగుతున్నదని విమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఏమైందని ప్రశ్నించారు. రైతుబంధు, తులం బంగారం, రైతు బీమా ఇలాంటి సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మక్కయాడని ఆరోపించారు. బీజేపీపై విమర్శలు చేస్తే కేంద్రం నోటుకు ఓటు కేసులో జైలుకు పంపిస్తుందని భయం పట్టుకుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిగా, స్పీకర్‌గా పదవులు అనుభవించారని బాజిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరాడని మండిపడ్డారు. తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోచారానికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు పోచారం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
తన సొంత లాభం, అధికారం కోసం పార్టీ మారాడని ఆరోపించారు. పోచారాన్ని నియోజకవర్గ ప్రజలు ఇక నమ్మబోరని, రాబోయే ఎన్నికల్లో ఆయనను ఓడించి బాన్సువాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. యూరియా యాప్‌తో రైతులు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘యాప్ పోవాలే.. కేసీఆర్ రావాలే’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి సభ్యత్వ నమోదు చేయాలని కోరారు. సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు జుబేర్, యలమంచిలి శ్రీనివాసరావు, అంజిరెడ్డి, తెల్ల రవికుమార్, కిషన్, మధు, శేఖర్, హకీం, సూదం నవీన్, సమీర్, నజీర్, దేవేందర్, ఫారూక్తోపాటు కోటగిరి, పొతంగల్, రుద్రూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌తో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. యాప్‌ను వెంటనే తొలగించాలని సన్నాహక సమావేశంలో తీర్మానం చేశాం. రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు పంటలు పండించుకునే పరిస్థితి లేదు. ఉచిత విద్యుత్ సరఫరా కూడా సరిగా ఇస్తలేడు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. కేవలం తెలంగాణ నుంచి నోట్ల సంచులు నింపి ఢిల్లీకి పంపించడం ఒక్కటే పనిగా పెట్టుకున్నాడు. రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం. బాన్సువాడలో పోచారాన్ని ఓడించి గులాబీ జెండా ఎగురవేస్తాం.

బాన్సువాడలో ఇటీవల చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్కు 42 శాతం ఓటర్లు, కాంగ్రెస్‌కు కేవలం 21శాతం మాత్రమే ఓటర్లు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోచారం రూ. వేల కోట్లు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం కేసీఆర్ వెంటే ఉంటానని తెలంగాణ తిరుపతి దేవస్థానం వద్ద ప్రమాణం చేసిన పోచారం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయ్యాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పడం సిగ్గు చేటు. పోచారానికి రాబోవు ఎన్నికల్లో ప్రజలే చరమగీతం పాడుతారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు. కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు భయపడొద్దు, బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
-వీజీ గౌడ్, సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి
ప్రతి కార్యకర్త ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేసిన సంక్షేమ పథకాలను వివరించాలి. సభ్యత్వ నమోదులో బాన్సువాడ టాప్‌లో ఉండాలి. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదులో సైనికుడిగా పని చేయాలి.

ఎస్ఐఆర్ కార్యక్రమంలో కొత్త ఓట్లు చేర్చుకోవడంతో పాటు పాత ఓట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఇంత వరకు ఒక్క హామీ కూడా అమలుచేయలేదు. ఆరుగ్యారంటీల అమలు ఊసేలేదు. పంట రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే . కాంగ్రెస్ ఆరాచకాలపై గొంతెత్తి మాట్లాడాలి.