నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 20 : ఎన్నికల్లో ఓడిపోయామని ఆందోళన చెందవద్దని.. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్‌లోని తన నివాస ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లతో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజుల్లో గ్యారెంటీ హామీలు ప్రజలకు అందించాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలన్నారు.
లేని యెడల హామీల అమలు కోసం ప్రజలతో కలిసి ఉద్యమం చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వేలాది కోట్ల నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసిన ఫలితంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సిందేనన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులందరూ ఐక్యంగా ఉండి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన గురుతర బాధ్యతను గుర్తించాలన్నారు. సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండ ల అధ్యక్షులు మధుకర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.