బాన్సువాడ, ఆగస్టు 22: ప్రజలకు ఆశలు చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని, రైతుబంధు డబ్బులనే రుణమాఫీకి వాడారని, అయినా సంపూర్ణంగా మాఫీ చేయలేదని టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు రైతులంతా బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాలని, అందరికీ మాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
బాన్సువాడలో నిర్వహించిన రైతుధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. రైతు రుణమాఫీకి ఏడున్నర వేలు కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, అవి కూడా రైతుబంధు డబ్బులేనని తెలిపారు. రుణమాఫీ విషయంలో సీఎం సంపూర్ణంగా చేశామని చెబితే, ఒక మంత్రి ఏడున్నర వేల కోట్లు అయ్యాయని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి లక్ష్మీపుత్రుడిగా బిరుదునిచ్చి నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులు మంజూరు చేసిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పోచారం.. కేవలం కొడుకుల కోసమే రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు. మీకిచ్చిన వ్యవసాయ శాఖ సలహాదారు పదవితో 25లక్షల మందికి రుణమాఫీ చేయించే సలహా ఇవ్వగలవా? అని ప్రశ్నించారు. స్థానికంగానే బలమైన నాయకుడు తయారుకావాలని పిలుపునిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న జుబేర్‌ను అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ నాయకులు మోచి గణేశ్, మాజీ సర్పంచ్ విఠల్, రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.