ఖలీల్‌వాడి, మే 22 : హైడ్రా డిపార్ట్మెంట్లో బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ సరికొత్త విధ్వంస పాలనకు నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. రెండువందల బుల్డోజర్ డ్రైవర్ల పోస్టుల భర్తీకి 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అభివృద్ధి కోసం కాకుండా వినాశం కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టడం వింతగా ఉన్నదని పేర్కొన్నారు. యూపీలోని యోగి సర్కారును తలదన్నేలా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి బుల్డోజర్ పాలన సాగుతోందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.
చట్టపాలన ప్రకారం బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చిన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లనే నమ్ముకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రజాస్వామిక విలువలను రూల్ ఆఫ్ లాను రాజ్యాంగాన్ని పౌర హక్కులను లెక్క చేయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజల హక్కులను హరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిని సమాధి చేస్తూ అందాలను ఆరబోయడం పాపులర్ సంస్కృతిగా చిత్రీకరిస్తూ తెలంగాణ ఆత్మగౌరవ భాషను, యాసను గోస పెడుతూ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దోపిడీ భాషను పరిచయం చేసిన రేవంత్‌రెడ్డి చివరకు సాధారణ ప్రజల జీవితాల్లోకి బుల్డోజర్ న్యాయాన్ని తేవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.
ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు
అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తే వారిని బుల్డోజర్ పాలన పేరుతో అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయడం సర్వ సాధారణంగా మారిందన్నారు. వారు పేదలా, మేధావులా, చరిత్రకారులా, జర్నలిస్టులా, వైద్యులా అన్నది కాంగ్రెస్‌కు పట్టదని, కాంగ్రెస్ పాలనను వ్యతిరేకించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీకి ఈడీ, రేవంత్‌కు జేసీబీ, ఏసీబీ జనాలను ఏడిపించే వెపన్స్‌గా మారాయన్నారు. పొద్దున లేస్తే తిట్టడాలు, అక్రమ కేసులు పెట్టి కొట్టడాలు, ఉన్న అద్భుతమైన నిర్మాణాలు కూలగొట్టడాలు తప్ప కొత్త కట్టడాలు లేని రేవంత్ పాలన దేనికి సంకేతమని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాల ఆకృత్యాలే దర్శనమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్షోభంలో వ్యవసాయం..
రైతుబంధు ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా సర్కార్ చేసిన గాయంతో వ్యవసాయం సంక్షోభంలో పడిందని పేర్కొన్నారు. పంటలు కొనే దిక్కు లేదన్నారు. రియల్ ఎస్టేట్ డమాల్ అయ్యిందని, రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆక్రందనల పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లితే, రేవంత్ పాలనలో రాష్టమంతా దుర్భిక్షంగా మారిందని ధ్వజమెత్తారు. రా హుల్‌గాంధీ ఇకనైనా రేవంత్ మోసపు పాలనపై నోరు విప్పాలని, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్ర జలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.