నిజామాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతి నిధి)/ ఖలీల్‌వాడి : గత ఎంపీ ఎన్నికల్లో కవితను ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అర్బన్ నియోజకవర్గ సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ కాంగ్రెస్‌కు జగిత్యాలలో లక్ష రావాల్సిన ఓట్లకు బదులుగా 12వేలే వచ్చాయని… టి.జీవన్‌రెడ్డి ఓట్లను బీజేపీకి మళ్లించారని చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోయినా సరే అర్వింద్‌ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2019లో 12వేల ఓట్లే పోలయ్యాయన్నారు. ఇప్పుడు మరో కుట్ర జరుగుతున్నదన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిది గెలుపు కాదని, అక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ కుట్రపన్ని షకీల్‌ను ఓడగొట్టారన్నారు. బీజేపీ ఇన్చార్జి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా నామమాత్రపు వ్యక్తికి టికెట్ ఇప్పించి అర్వింద్ చక్రం తిప్పి కాంగ్రెస్‌కు సహకరించారన్నారు. సుదర్శన్‌రెడ్డి గెలుపునకు అర్వింద్ సహకరించారన్నారు. ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. దాని ఫలితమే ఇవాళ అర్వింద్‌కు వ్యతిరేకంగా ఎక్కడో జగిత్యాలలో ఉన్న జీవన్‌రెడ్డిని నిలబెడుతున్నారన్నారు. వీక్ అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టి అర్వింద్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు. అర్వింద్‌కు ఇప్పుడు సుదర్శన్‌రెడ్డి సహాయం చేస్తున్నారన్నా రు. దాని ద్వారా బీజేపీని గెలిపించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకున్నదని ఆరోపించారు. మైనార్టీ ఓటర్లంతా ఈ అక్రమ సంబంధాన్ని గుర్తించాలని వేముల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై బీఆర్ఎస్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. కాలు మంచిగా లేకున్నా, బిడ్డ జైలులో ఉన్నప్పటికీ కేసీఆర్ రైతుల కోసం బయటికి వచ్చి ప్రభుత్వ కుట్రలను బట్టబయలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ రాకతో కాంగ్రెస్‌లో వణుకు మొదలైందన్నారు.
మొన్న మోదీ ముందే గుజరాత్ మోడల్ కావాలి… గుజరాత్ అభివృద్ధి బాగున్నదని కితాబునిచ్చి తెలంగాణలో గుజరాత్ మోడల్ పెడుతానని చెప్పిన రేవంత్ మాటను ప్రజలంతా గుర్తుంచుకోవాలని వేముల చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్‌ను బొంద పెట్టి బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తారన్నారు. నిజామాబాద్ ముస్లిం ఓటర్లంతా ఇదంతా గమనించాలన్నారు.
కార్యకర్తలకు కష్టమొస్తే ఏక్షణమైనా అండగా నిలబడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లుగా వేముల చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైతున్నదన్నారు. నిజామాబాద్ కార్యకర్తలంతా దెబ్బతిన్న పులిలా ప్రతీకారం తీసుకొని బాజిరెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. బాజిరెడ్డిపై నిలబడిన వ్యక్తులు పోటీయే కాదన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎక్కడ నిలబడితే అక్కడ్నుంచి గెలిచిన చరిత్ర బాజిరెడ్డికి ఉందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌కు ప్రజలకు సత్సంబంధాలే లేవన్నారు. బాల్కానీలో నిలబడి సోషల్ మీడియాలో మాట్లాడడం తప్ప ప్రజల మనిషి కాదన్నారు. ఐదేండ్లలో పార్లమెంట్లో నిజామాబాద్ ప్రజల మేలు కోసం మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఒక్కరోజు కూడా మాట్లాడని ఇలాంటి దద్దమ్మలను విసిరి పారేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బీఆర్ఎస్ నాయకులు సిర్ప రాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాశ్, మురళి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 1 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయారు. గడిచిన ఐదేండ్లలో ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లాకు చేసిందేమీ లేదు. ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదేండ్లు గడిచినా పత్తాలేదు. గ్రామాల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు నిలదీయండి. నన్ను ఆశీర్వదించండి సేవకుడిగా పని చేస్తా, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటా.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అంతే ఉత్సాహంతో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించుకుందాం. పార్టీ వీడిన వారి గురించి పట్టించుకొని నిరుత్సాహానికి గురికావొద్దు. పార్టీ కోసం పనిచేసే నాయకులు ప్రజలకు అండగా ఉంటా రు. మన మాస్ లీడర్‌ను ఢిల్లీలో గొంతు ఎత్తేలా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో నాయకులు దిక్కులేక ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కష్టాల్లోకి నెట్టేసింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు వద్దకు వస్తున్నారు.వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. ఆయనకు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఢిల్లీలో కొట్లాడి మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు.