ఖలీల్‌వాడి, ఆగస్టు16 : రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రూ.2లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్లబొల్లి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిలువునా ముంచేసిన రేవంత్ సర్కారుపై ప్రజలందరూ తిరగబడాలన్నారు.
ఎక్కడికక్కడా నిరసనలు వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను నిలదీయాలంటూ పిలుపునిచ్చారు.శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రమంతటా తిరుగుతూ పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుళ్లపై ప్రమా ణం చేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. దేవుళ్లపై ఒట్టేసి అబద్ధాలు ఆడుతున్న ఇలాంటి ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలు, రైతులను మోసం చేశారని మండిపడ్డారు.
వంద రోజుల్లో రుణమాఫీతోపాటు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పి రెండోసారి రైతులను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ మాట తప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ఓట్లు దండుకుని మూడోసారి రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీశ్ రావుపై నీచాతి నీచంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని వేముల తప్పుబట్టారు. మంత్రి పదవులను గడ్డి పోచ మాదిరిగా రాజీనామా చేసి వదిలేసిన చరిత్ర హరీశ్ రావుకు ఉంటే, సీమాంధ్ర నేతల అడుగులకు మడుగులు ఒత్తి, వారి మోచేతి నీళ్లు తాగిన చరిత్ర ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డిదని ఘాటుగా విమర్శించారు.
కేసీఆర్ సర్కార్ చేసిన
రుణమాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులను నిలువునా మోసం చేసిందని వేముల లెక్కలతో సహా వివరించారు. 2016లో ఉమ్మడి జిల్లాలో 3 లక్షల 79 వేల 520 మంది రైతులకు రూ.1571.25 కోట్ల రుణమాఫీ చేస్తే.. 2024 లో రేవంత్‌రెడ్డి సర్కార్ ఉమ్మడి జిల్లాలో కేవలం రూ.1281 కోట్ల రుణమాఫీ మాత్రమే చేసిందని వివరించారు. రుణమాఫీపై రేవంత్ సర్కార్ రైతులను నిలువునా మోసం చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద రైతులతో కలిసి ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ ధర్నాకు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కొత్తూర్ లక్ష్మారెడ్డి, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్ ఠాకూర్, మురళి, సత్యప్రసాద్ పాల్గొన్నారు.