కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓటుబ్యాంకుగానే చూస్తూ వెనుకబడిన సామాజికవర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నదని బీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీసీలను వంచించడంలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనన్నారు. బీసీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్.. అని, ఆయన మరోసారి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొన్నాల లక్ష్మయ్య పలు విషయాలను పంచుకున్నారు. బజారులో గొడ్లను అమ్మినట్లు కాంగ్రెస్ నేతలు టికెట్లను అమ్ముకున్నారని వెల్లడించారు.
నిజామాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో ఆయనో కీలకమైన బీసీ నేత. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణకు మొట్ట మొదటి పీసీసీ చీఫ్. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా దశాబ్దం పాటు పని చేసిన వ్యక్తి. బీసీ నేతగా గుర్తింపు పొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆయనే వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గ బిడ్డ పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ పార్టీలో బీసీల వాటాను అడిగినందును ప్రస్తుతం అరువు తెచ్చుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేతిలో తీవ్రమైన రీతిలో అవమానానికి గురయ్యారు. తన వయసు కు సైతం గౌరవం ఇవ్వకుండా పొన్నాలను రేవంత్ రెడ్డి అవమానించడంతో పాటు పరుష పదజాలంతో నిందించడంతో పొన్నాల తీవ్రంగా కలత చెందారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలో ఎదురైన తీరును చూసి, బీసీ నేతలకు దక్కుతోన్న ప్రాధాన్యతను గమనించి హస్తం పార్టీని వీడారు. దేశం, రాష్ట్రంలో బీసీలకు గౌరవం దక్కే చోటుకోసం చూస్తున్న పొన్నాల లక్ష్మయ్యకు కేవలం కేసీఆర్ రూపంలోనే బీసీ ఆత్మబంధువు కనిపించారు. కేసీఆర్‌తో ఉన్న రాజకీయ అనుబంధంతో భారత రాష్ట్ర సమితిలో చేరిన ఆయన ఎన్నికల ప్రచార నిమిత్తం నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడగా పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం…
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానమే లేదు. రాష్ట్రంలో 54శాతం మంది బీసీలుంటే వారిచ్చిన సీట్ల సం ఖ్య ఎంతనో గమనిస్తే ఈ విషయం అర్ధమై పోతుంది. పార్టీని నడుపుతున్న వారు, వారి వెనుకున్న వారెవ్వరో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పెద్ద మనుషులు ఈ ప్రాంతాన్ని గతంలో 40 ఏండ్లు పరిపాలించినా 50 శాతం ఎమ్మెల్యేల టికెట్లు కూడా బీసీలకు రాకపోవడానికి కారకులు ఎవరు. అందుకే బీసీలకు ద్రోహం చేసిం ది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణలో బీసీ నాయకత్వాన్ని ఎదుగనియ్యకుండా చేయడంలోనే కాం గ్రెస్ పార్టీ విజయవంతమైంది. బీసీలంతా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఏర్పడింది. కుట్రలు, కుతంత్రాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్‌కు మద్దతు తెలపడం ప్రస్తుతం చారిత్రక అవసరం. సాగుకు 3గంటలు కరెంట్ సరిపోతుందని చెప్పే వ్యక్తులున్న కాంగ్రెస్ పార్టీని నమ్మకూడదు. వ్యవసాయానికి ఎకరానికి గంట చొప్పున కరెంట్ ఇస్తే సరిపోతుందనడం ఆ నాయకుడి మూర్ఖత్వం. కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉండడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఈ విషయంపై ఎవరైనా కాంగ్రెస్ పెద్ద మనుషులు వస్తే నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను. దమ్ముంటే నా సవాల్‌ను కాంగ్రెస్ నేతలెవ్వరైనా స్వీకరించాలి.
బీసీలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పా ర్టీలు పోటాపోటీగా పని చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సైతం బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వారు కేవలం రాజకీయ కోణంలోనే బీసీలను చూస్తున్నారు తప్ప బీసీలను నిత్యం మోసం చేస్తూనే ఉన్నారు. బీసీలను వంచించడంలో కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే. ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా బీసీలను మోసం చేస్తున్న తీరును వెనుకబడిన వర్గాలకు చెందిన విజ్ఞులంతా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నా ద్వారా చేతనైనంతగా బడుగు, బలహీన వర్గాల ప్రజలను చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నాను. నిజామాబాద్ ప్రాంతానికి రావడం నా అదృష్టంగా భా విస్తున్నా. రాజకీయంగా చైతన్యవంతమైన ఇక్కడి ప్రజలంతా బీసీలను ద్వేషించే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. నిజామాబాద్‌లో రైతులు పండించే పసుపు పంట కు ఎనలేని గుర్తింపు ఉంది. ఈ పసుపుతో రోగాలను నయం చేసే గుణం ఉంది. ఆ విధంగానే రాజకీయ రుగ్మతలను పారదోలే విధంగా ప్రజలంతా ఓటుతో జాతీయ పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. ముఖ్యంగా బీసీ ప్రజలంతా ఐక్యంగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలి.
తెలంగాణ కోసం 2001లో 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం పెట్టిన వ్యక్తిని నేనే. తెలంగాణ కోసం నేను మొదట్నుంచి నా వంతుగా చిత్తశుద్ధితో కృషి చేశాను. రాష్ట్రంలో పుష్కర కాలం పాటు మంత్రిగా అనేక శాఖలకు బాధ్యతలు నిర్వర్తించాను. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులను అంకితభావంతో, అత్యంత నిబద్ధతతో, క్రియాశీలకంగా 40 ఏండ్ల పాటు సేవ చేశాను. అలాంటి నాకు అత్యంత నీచంగా, బీసీ లీడర్‌గా ఉన్న నన్ను అవమానకరంగా ఇబ్బందులకు గురి చేసిన ఘటనలను గుర్తుకు తెచ్చుకుంటేనే భయమైతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నేతకు దక్కిన అవమానాన్ని ప్రజలంతా గమనించారు. ఇప్పుడు ఆ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తున్నారో అందరికీ అర్థమైంది. హస్తం పార్టీలో బీసీ నాయకులెవ్వరూ పనికి రారని, వాళ్లు ఓడిపోయే వాళ్లంటూ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నదేనని నేను చెబుతున్నాను. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అనుబంధం లేని వ్యక్తులను, పార్టీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వాళ్లు బజారులో గొడ్లను అమ్మినట్లు పార్టీ టికెట్లను అమ్ముకున్నారు.