హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఇక్కడి నుంచి కుయుక్తులు పన్నుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో దాదాపు 700 కుటుంబాలు పదేండ్లుగా భూదాన భూముల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది పోలీసులతో, బుల్డోజర్లతో బలవంతంగా కుటుంబాలను బయటకు పంపి విధ్వంసం సృష్టించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యతో నిర్వాసితులై రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతున్నదని విమర్శించారని ఒక ప్రకటనలో గుర్తుచేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించిన తీరు సరికాదని పేర్కొన్నారు. కేరళ సీఎం ఆ రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారని చులకనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని పేదలకు అకడే ఇండ్లు నిర్మించి, స్థిరనివాసం ఏర్పాటు చేయాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.