హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించిన హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) ప్రాజెక్టు భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిబంధనలు సరళతరం చేసినప్పటికీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు వస్తాయో రావో అని కాంట్రాక్టర్లు సందేహిస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి పెట్టారు. కాగా, ఈసారి బడ్జెట్లో హ్యామ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నది. హ్యామ్ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని గ్రామీణ, జిల్లా రోడ్ల రూపురేఖలు మారుస్తామని ఊదరగొడుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. ఏడాదికిపైగా కసరత్తుతో ప్రణాళికలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్ల నుంచి చుక్కెదురైంది.
కాంట్రాక్టర్లు సమకూర్చుకునే నిధులకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిబంధనలను సవరించింది. బిడ్డింగ్‌లో పాల్గొనే కాంట్రాక్టర్ల నెట్‌వర్త్‌ను పని విలులో 20 నుంచి 15 శాతాని కుదించడంతోపాటు వారు ఇవ్వాల్సిన ష్యూరిటీ మొత్తాన్ని బ్యాంక్ గ్యారెంటీ రూపంలో కాకుండా ఇన్సూరెన్స్ బాండ్ల రూపంలో ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం భరించాల్సిన 40% వ్యయాన్ని 10 వాయిదాల్లో కాంట్రాక్టర్లకు చెల్లిస్తామని, కాంట్రాక్టర్లు సమకూర్చుకునే 60% నిధులను ఏటా కొంత మొత్తం చొప్పున 15 ఏండ్లలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వంపై నమ్మకం లేకుంటే వివిధ మార్గాల ద్వారా రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి నేరుగా ఆర్బీఐ ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లిస్తామని, 15 ఏండ్లపాటు నిర్వహణ ఖర్చులు కూడా తామే భరిస్తామని స్పష్టం చేసింది. అయినా కాంట్రాక్టర్ల నుంచి ఉలుకూ పలుకూ లేదు.
ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తాం..
హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశలో రూ.11,399 కోట్లతో 5,824 కి.మీ. మేర ఆర్అండ్బీ రోడ్లను, మరో రూ.6,294 కోట్లతో 7,449 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిరుడు నవంబర్‌లో ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)లను ఆహ్వానించింది. కానీ, కాంట్రాక్టర్ల భయాలతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని, అందుకే ఈ ప్రాజెక్టులో జాప్యం జరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తుందో చూశాక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని అంటున్నారు.
ఇతర రాష్ర్టాల్లో విజయవంతం
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలు ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్), బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానాలను కలగలిపి హైబ్రిడ్ విధానంలో విజయవంతంగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఆయా రాష్ర్టాల్లో బ్యాంకుల ద్వారా రుణాలు సమకూర్చుకొని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వాలు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నాయి. కానీ, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు సకాలంలో బిల్లులు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తే తప్ప హ్యామ్ ప్రాజెక్టు ముందుకుసాగే అవకాశం కనిపించడం లేదు.
కొలిక్కి తెచ్చేందుకు కృషి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హ్యామ్ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నానని, దీనిపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చిస్తానని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇటీవల ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హ్యామ్ ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటి?
ప్రభుత్వం ఎన్ని వెసులుబాట్లు కల్పిస్తామన్నా కాంట్రాక్టర్లు నమ్మడంలేదు. బిల్లులు వస్తాయో రావోనని, ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన 40% నిధులు సమయానికి ఇస్తుందో లేదోనని, బ్యాంకుల నుంచి తాము సమకూర్చుకునే 60% నిధులను 15 ఏండ్లలో చెల్లిస్తామంటే అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని, ఈలోగా ప్రభుత్వం మారితే తమ గతి ఏమికావాలని భయపడుతున్నారు. పనులు నిర్వహించి వెంటనే ప్రస్తుత పద్ధతిలో తమకు బిల్లులు చెల్లిస్తే సరిపోతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా హ్యామ్ విధానం అంతగా అనుకూలించదని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి స్వతహాగా రావాల్సిన నిధులు తప్ప అదనంగా ఒక్క పైసా కూడా వచ్చే అవకాశం లేదని, తమకు కనీసం కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా పనులు చేపట్టేందుకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. గతంలో చేసిన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బిల్లులు చెల్లించలేదని, రానున్న ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తే తాము నిండా మునిగిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.