మాచారెడ్డి, జూన్ 19 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్‌లో గురువారం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు లాక్కునేందుకు యత్నిస్తున్నారని మండలంలోని అక్కాపూర్ గ్రామానికి చెందిన దళితులు వాపోయారు. గ్రామానికి చెందిన 50 కుటుంబాలు సుమారు 70 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. అయితే, గురువారం అటవీశాఖ అధికారులు పోలీసు బందోబస్తుతో వచ్చి ఆయా భూముల్లో ఒడ్లను తొలగించి ట్రెంచ్ కొట్టించారు. ఈ నేపథ్యంలో అధికారులకు, దళితులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
50 ఏండ్లుగా తాము ఈ భూముల్లోనే సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు వచ్చి ఆ భూమి తమది కాదనడం సరికాదని వాపోయారు. ఇలా దాడులు చేసి తమ జీవనోపాధి దెబ్బ తీయొద్దని అధికారులను వేడుకున్నారు. అయితే, ఈ భూముల్లో 2016 నుంచి ప్లాంటేషన్ చేస్తుంటే ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారని మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్య తెలిపారు. ఆయా ఘటనల్లో కేసులు కూడా నమోదయ్యాయన్నారు. అటవీ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి ఎఫ్‌డీవో రామకృష్ణ, కామారెడ్డి ఎఫ్ఆర్వో రమేశ్, మాచారెడ్డి ఎస్సై అనిల్, అటవీ, పోలీసు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.