రెంజల్, నవంబర్ 4 : ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. మండలంలోని దూపల్లి సొసైటీ పరిధిలో ఉన్న కళ్యాపూర్ గ్రామ రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని స్థానిక రైస్‌మిల్లుకు అలాట్ చేశారు. రోజులు గడుస్తున్నా ధాన్యం తరలింపులో జాప్యం నెలకొనడంతోపాటు గన్నీ సంచులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం ఏర్పడడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం నవీపేట్- కందకుర్తి ప్రధాన రోడ్డుపై బైఠాయించి, ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆర బెట్టిన ధాన్యం రైస్‌మిల్‌కు అలాట్మెంట్ కాక, గన్నీ సంచులు అందుబాటులో లేక రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వాతావరణం లో మార్పు కారణంగా ధాన్యం తడిసిపోయి మ్యాచర్ రాకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కళ్యాపూర్‌కు చెందిన రైస్‌మిల్‌కు మాత్రమే అలాట్మెంట్ ఇచ్చారని, సొసైటీ సీఈవో, సిబ్బంది స్పందించడంలేదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, సీఈవో జీవన్‌రెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపొయాయి. ఒకే రైస్‌మిల్‌ను కేటాయించడంతో ధాన్యాన్ని తరలించడంలో జాప్యం ఏర్పడిందని, రైతుల ధాన్యాన్ని మరో రైస్‌మిల్‌కు అలాట్ మెంట్ చేసినట్లు రెంజల్ ఇన్చార్జి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ తెలిపారు.