మోర్తాడ్/బాన్సువాడ, ఆగస్టు 20: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రెండ్రోజులకు పోటెత్తిన వరద బుధవారం కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 81867 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5టీంఎసీలు)కాగా, ప్రస్తుతం 1088.1 అడుగుల (70.140టీఎంసీలు) మేర నీటి నిల్వ ఉన్నది. 16 గేట్ల ద్వారా 52 850, ఎస్కేప్ గేట్ల ద్వారా 3 వేలు, వరద కాలువకు 20వేలు, కాకతీయ కాలువకు 5 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇక, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌కు 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. 16 గేట్ల ద్వారా 1.06 లక్షల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజె క్టు పూర్తి స్తాయి నీటి మట్టం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,403 అడుగుల ( 15.612 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
బోధన్ రూరల్, ఆగస్టు 20: నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నదిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. సాలూరా వద్ద పురాతన వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తున్నది. సాలూరా మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. వరద తగ్గే వరకూ మంజీరా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితే వరద తగ్గే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
రెంజల్, ఆగస్టు 20: గోదావరినదిలో నీటి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో కందకుర్తి వద్ద గోదావరి నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెన బుధవారం బయటపడింది. నాలుగైదు రోజులపాటు వరుసగా కురిసిన వర్షాలు కాస్త శాంతించడంతో గోదావరిలో నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. అంతర్రాష్ట్ర సరిహద్దులో పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను ఎత్తివేసి, రాకపోకలను ప్రారంభించారు. బోధన్ ఆర్టీసీ డిపోనకు చెందిన ధర్మాబాద్ బస్సు సర్వీసులను పునరుద్ధరించినట్లు డీఎం విశ్వనాథ్ బుధవారం తెలిపారు.