నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్‌బిలోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది. 2019 వరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ రావడంతో బడిని బతికించి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా చర్యలు చేపట్టారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో పాఠశాల పూర్వవైభవాన్ని సంతరించుకున్నది.
ఐదు తరగతులు..ఒక్కో తరగతికి 22కి తగ్గకుండా విద్యార్థులు.. బాల బాలికలతో కలిపి మొత్తం 152 మంది.. ఇదేదో ప్రైవేట్ పాఠశాల కాదు.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) ప్రభుత్వ బడిలో ఇంత మంది పిల్లలు ఉన్నారు? ఇదెక్కడ ఉన్నది …? దీని ప్రత్యేకత ఏమిటీ ? తమ పిల్లలు ఈ పాఠశాలలోనే చదివేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోవాలానుకుంటున్నారా..? అయితే చదవండి.
-రెంజల్, ఫిబ్రవరి 27
తాడ్‌బిలోలిలో ప్రధానంగా వ్యవసాయం, బీడీ చుట్టే పనిపై ఆధారపడి జీవించే కుటుంబాలే అధికం. గ్రామంలో మొత్తం జనాభా 3,500 ఉండగా, ఓటర్లు 2,200. పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి చదివించడం వీరికి తలకు మించిన భారమే. ఏదోవిధంగా పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించినా ఫీజుల భారం మోయలేని దుస్థితి. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఐక్యంగా ప్రైవేట్‌కు దీటుగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ, ఎస్ఎంసీ ప్రోత్సాహంతో ప్రాథమిక పాఠశాలను ఇంగ్లిష్ మీడియంగా మార్చాలని నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయుడు సాయిలు, ఉపాధ్యా య బృందం ఇంగ్లిష్‌లో బోధనకు సిద్ధమయ్యారు. ఇందుకోసం బడిలో సరిపడా ఉపాధ్యాయులు ఉన్నా పిల్లల అడ్మిషన్లను పెంచేందుకు చెరువులో పని చేసే ఉపాధి కూలీలను కలిసి అవగాహన కల్పించారు. బడిలో తగిన ఏర్పాట్లు చేయడంతో 2019 జూన్ 6న ఆంగ్ల మాధ్యమానికి డీఈవో అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్ మీడియంగా మార్చడంతో అందరూ సంతోషించారు. ప్రైవేట్‌కు వెళ్తున్న పిల్లలందరినీ తిరిగి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఒకటో తరగతిలో 38 మంది, రెండో తరగతిలో 25, 3వ తరగతిలో43, నాలుగో తరగతిలో 24, ఐదో తరగతిలో 22 మందితో ప్రస్తుతం ఈ పాఠశాల నడుస్తున్నది. ప్రైవేట్ పాఠశాలకు ఎంత మాత్రం తీసి పోకుండా యూనిఫాం, టై, బెల్టు, షూ ధరించిన పిల్లలను తల్లిదండ్రులే స్వయానా పాఠశాలలో దించుతుంటే ఈ పాఠశాల ముందు ప్రైవేట్ పాఠశాల పనికి రాదని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకున్న గ్రామ అభివృద్ధి కమిటీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యా బోధన జరగాలని ముందుకు రావడంతో పాఠశాల చుట్టూ మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో సంతోషంగా ఉంది. గతంలో సర్కారు బడులదే హవా…కానీ ఇంగ్లిష్ మీడియం రావడంతో ప్రైవేట్ బడులవైపే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపారు.
-కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, ఇంగ్లిష్ టీచర్, తాడ్‌బిలోలి
టీచర్లు ఇంగ్లిష్ మీడియం పాఠాలను అర్థమయ్యేలా బోధిస్తున్నారు. తెలుగుతోపాటు ఇంగ్లిష్ మీడియంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెబుతుండడంతో రాయడం, చదవడం సులభతరమైంది.
– మమ్మాయి శ్రీనిత, 4వ తరగతి
విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. నా హయాంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల పునఃప్రారంభానికి గ్రామస్తుల సహకారం మరువలేనిది.
– వెల్మల్ సునీత, సర్పంచ్, తాడ్‌బిలోలి
ప్రస్తుతం తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఇంగ్లిష్ మీ డియం పాఠశాలలోనే చదివించేందుకు ఇష్టపడుతున్నారు. డబ్బులున్న వారికే సొంతమైన ఆంగ్ల మాధ్యమాన్ని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం.
– రాజేందర్ సింగ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోనే బోధిస్తాం. ఐదుగురు ఉపాధ్యాయులతో బోధన జరుగుతున్నది. పిల్లలు చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నారు. తగ్గి పోతున్న పిల్లల సంఖ్యను పెంచేందుకు కృషి చేసిన సర్పంచ్, గ్రామస్తులు, టీచర్లకు కృతజ్ఞతలు.
– ఉషం సాయిలు, హెచ్ఎం ప్రాథమిక పాఠశాల తాడ్‌బిలోలి