నిజామాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోతున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి రెండు సీజన్లలో పెట్టుబడి సాయం మాటెత్తలేదు. ఈ యాసంగి సీజన్లో రైతుభరోసా పథకం కింద రూ.12వేలు ఎకరానికి ఇస్తామన్నారు.
నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో వరి సాగుచేసిన రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. అయినా రైతుభరోసాకు అతీగతీ లేదు. మరోవైపు రుణమాఫీ పేరిట గతేడాది పంద్రాగస్టు రోజున ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సగాని కన్నా ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. దీంతో వారంతా చెప్పులు అరిగేలా వ్యవసాయాధికారులు, బ్యాంకర్ల చుట్టూ తిరుగుతూ విసుగు చెందుతున్నారు. రైతు మహోత్సవం పేరిట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాళ్ల ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా రైతులకు మేలు చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నది. సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి రాక నేపథ్యంలో రైతు భరోసా, రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని ఉమ్మడి జిల్లా రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో రుణమాఫీ జాబితాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో బాధితులు రుణాల రద్దు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐదో విడుత ఏదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. లక్షలాది మందికి రుణమాఫీ ఇంకా వర్తించకపోవడంతో వారంతా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హామీలు ఇచ్చి, ఇప్పుడు అమలు చేయకపోవడం రైతు మహోత్సవం అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
రైతు భరోసాపై మంత్రులు, ఎమ్మెల్యేలు పూటకోసారి మాట మారుస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా పంపిణీ షురూ అయినప్పటికీ ఇప్పటి వర కూ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో రేవంత్ సర్కారుపై రైతన్నలంతా దుమ్మెత్తి పోస్తున్నారు. రూ. ఆరువేల పెట్టుబడి సాయాన్ని కూడా సరైన రీతిలో అందివ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవం పేరిట 136 స్టాళ్లను జీజీ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నది. ఇందులో రైతులు పండించిన పంట ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య శాఖ, అనుబంధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులు హాజరు కానున్నారు. నూతన వ్యవసాయ పద్ధతులపై వర్క్ షాపు నిర్వహించబోతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుకు ఆదరణ కరువైంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఠంఛనుగా పెట్టుబడి సాయం అందేది. ఇప్పుడు కాలం ముగిసినప్పటికీ పత్తా లేకుండా పోయింది. రుణమాఫీ రూ.2లక్షల్లోపు రద్దు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పాలకులు వాటి గురించే మాట్లాడడం లేదు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే రైతులకు మహోత్సవం వర్ధిల్లేదని సర్వత్రా చర్చ నడుస్తోంది.
స్టాళ్లను ఏర్పాటుచేసి సాంకేతికత, సాగు పద్ధతలపై వర్క్‌షాపులు నిర్వహించడం వల్ల రైతులకు కాసింత మేలు చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడి సాయం వంటి ఆర్థిక భరోసాను కాంగ్రెస్ సర్కారు అసంపూర్ణంగా అమలు చేయడంతో రైతుల ముఖాల్లో ఆనందం లేకుండా పోతోందనేది సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఎకరాకు రూ.15వేలు చొప్పున ఏటా రైతుభరోసా ఇస్తామంటూ చెప్పినట్లే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేస్తేనే మహోత్సవం చేసినట్లు అవుతుందని రైతులు భావిస్తున్నారు. కేసీఆర్ పాలనలోనే రైతులకు నిజమైన రైతు మహోత్సవం కనిపించిందని వారంతా చెబుతున్నారు.