లింగంపేట/కామారెడ్డి/కామారెడ్డి రూరల్/ ధర్పల్లి/సిరికొండ/ లింగంపేట/రామారెడ్డి/బీబీపేట్/భిక్కనూర్, మే 4: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి అందివచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యా న్ని సకాలంలో తూకం వేయకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడాల్సి వస్తున్నది.
ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు లింగంపేట, బీబీపేట్, తాడ్వాయి, గాంధారి, ధర్పల్లి, సిరికొండ తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. తుజాల్పూర్, యాడారం, బీబీపేట, మాందాపూర్, జనగామ, భవానీపేట, ధర్పల్లి మండలంలో మామిడి కాయలు నేలరాలాయి. జిల్లాకేంద్రంతోపాటు లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో మక్కజొన్న కొట్టుకుపోయింది. గాంధారి మండల కేంద్రంలో వడగండ్ల వాన కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. బీబీపేట, దోమకొండ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మాందాపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీలోని వర్షపునీరు ఇండ్లలోకి చేరింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్,పాత రాజంపేట వద్ద రైతులు ఆరబోసుకున్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ తీవ్రత తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందారు.
బీబీపేట్, మే 4: కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామానికి చెందిన రైతులు కలకుంట్ల రాజు, గోప వివేక్, గోప రంజిత్, గోప హేమలత, గోప కవిత కొనుగోలు కేంద్రంలో తడుస్తున్న ధాన్యాన్ని కుప్ప చూసేందుకు వెళ్లారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో అక్కడే ఉన్న ఓ చెట్టుకింద నిలబడ్డారు. ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. చెట్టుకింద నిలబడిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.