రెండు లక్షల రుణమాఫీ ఇస్తామంటే నమ్మినం. 15 వేలు రైతుబంధు ఇస్తామంటే నమ్మినం. వాళ్ల మాట ఇని ఓట్లేస్తే మమ్మల్ని గిట్ల మోసం జేసిండ్రని రైతులు కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. మెండోరా మండలం బుస్సాపూర్‌లో శనివారం పర్యటించిన బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కేసీఆర్ పాలనల మంచిగుండే. ఇప్పుడు మా బతుకుల ఆగమైనయని వాపోయారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాట్లు ఏయక మునుపే రైతుబంధు పైసలు అచ్చేటియి. ఆ పైసల్తోనే ఇత్తనాలు, మందులు కొంటుంటిమి. ఏ బాధ ఉండకపోయేది. కాంగ్రెసోళ్లు అచ్చినంక రైతుబంధు ఇయ్యకుండా ఎగ్గొట్టిండ్రు. విత్తనాలు ఏసేతందుకు పైసలు కావాల కదా. మళ్లీ అప్పు జేయాల్సి వచ్చిందని వివరించారు. రైతుల గోడు వారి మాటల్లోనే..
-మోర్తాడ్, మార్చి 25
పదేండ్లు కరంటు సరిగ్గ ఉండే. ఏడాది నుంచి సక్కగ ఉంటలేదు. ఎప్పుడు పోతదో తెలని పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందు ఇంట్ల ఇన్వర్టర్ పెట్టించుకుందామనుకన్న. కని కేసీఆర్ అచ్చినంక 24 గంటల కరంటు ఇచ్చుట్ల అవసరం పడలే. ఇప్పుడైతే కరంటు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. అడిగితే మీదికెళ్లి పోయందంటుండ్రు. రానురాను ఇంకెట్లుంటదో కరంటు పరిస్థితి.
– జగత్‌రెడ్డి, రైతు, దూద్గాం
కేసీఆర్ అంటే రైతులకు ఒక కన్న తండ్రి లెక్క. చెప్పనివి కూడా మస్తు జేసిండు. ప్రేమతోని చూసుకుండు కేసీఆర్. మాయమాటలు చెప్పి సీటుమీదికి వచ్చిండు రేవంత్‌రెడ్డి. వాళ్ల మాటలు నమ్మినందుకు ఇప్పుడు గోసపడుడు అయితుంది.
– మిట్టపల్లి గంగయ్య, మెండోరా
రుణమాఫీ రెండులక్షలు ఇస్తమంటే, రైతుబంధు 15 వేలు ఇస్తమంటే నమ్మి తప్పుజేసినం. ఇప్పుడు రుణమాఫీ సగం మందికి కాలే, రైతుబంధు రాలే. నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లేసి మోసపోయినం. పడిత్ ఉన్న భూములకు రైతుబంధు ఇయ్యమంటున్నరు. పైసలు లేక భూములను డెవలప్ చేసుకోలే. రైతుబంధు ఇవ్వకుంటే ఎట్ల? డెవలప్ చేసుకుంటున్న భూములకు కూడా రైతబంధు ఇయ్యాలే. నాలుగైదు ఎకరాలు ఉండి డెవలప్ చేసుకునేటోళ్లకు రైతుబంధు ఇచ్చేలా మాకోసం మీరు కొట్లాడుండ్రి.
– అశోక్, రైతు, దూదిగాం
నాకు బ్యాంకుల రెండున్నర లక్షల రుణం ఉంది. బ్యాంకోళ్లు బాకీ కట్టుమంటున్నరు. నేను కట్టా అని కరాఖండిగా జెప్పేసిన. కేసీఆర్‌ను వద్దనుకుని కాంగ్రెస్‌కు ఓటేసినమా. ఇప్పుడల్ల అందరు కేసీఆర్‌ను కావాలనుకుంటుం డ్రు. రైతుభరోసా ఇస్తమని రైతులను మోసం చేసిండ్రు కదా. ఇ ప్పుడు సర్పంచ్ ఎలక్షన్లల్ల రేవంత్‌రెడ్డికి బుద్ధి జెప్తం. కేసీఆర్ చెట్టు పెట్టి నీడనిచ్చేటోడు. అటువంటి కేసీఆర్‌ను వద్దనుకున్నందుకు బాధ వడుతున్నం.
– రాకేశ్, రైతు, బాబాపూర్
ఫారెన్‌లో హోటల్ మెనేజ్మెంట్ చేసిన. వ్యవసాయం బాగుంటుందని తిరిగి వచ్చిన. వస్తే ఏం లాభమున్నది. వచ్చినంక రైతుబంధు లేదు. రుణమాఫీ లేదు. రైతుబంధు రాక పం టకు సరిపడా ఎరువులు కొనే ధైర్యం వస్తలే. రైతుబంధు ఇస్తమంటుండ్రు కాని ఇస్తలేరు. కరంటు కూడ సరిగా అస్తలేదు. అడిగితే బ్రేక్‌డౌన్ అవుతుందంటుండ్రు. ఇంతకు ముందు ఎందుకు బ్రేక్డౌన్లు కాలే. ఇంతకు ముందు కాల్వల నీళ్లు వస్తుండే. ఇప్పుడు వస్తలే.
– ఎర్రం సాగర్, రైతు, బాల్కొండ
రైతుకు ఇచ్చే రుణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అదే కార్లకు, బంగ్లాకు ఇచ్చే రుణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ తక్కువ ఉంటది. మరి రైతులకు ఇచ్చే రుణానికి వడ్డీ ఎక్కువ ఎందుకు ఉంటది. రైతులకు ఇచ్చే రుణాలకు వడ్డీ తక్కువ ఉండేటట్లు చూడాల.
– జైడి సాయన్న, రైతు, బుస్సాపూర్
రైతుబంధు ఇస్తమని చెప్పి ఇస్తలేరు. రైతులంతా ఏకమై కొట్లాడాలే. అప్పుడే పది వేలంటరు. అప్పుడే పన్నెండు వేలంటరు. 15 వేలు ఇస్తమని ఇస్తలేరు. ఇప్పటికైనా రైతులంతా ఏకం గావాలే. రైతుబంధు వచ్చే వరకు కొట్లాడాలే. రుణమాఫీ కూడా బ్యాంకుల ఎంత లోన్ ఉన్నా సంబంధం లేకుండా రెండు లక్షల రుణమాఫీ జెయ్యాలే.
– నోముల రవీందర్, రైతు