రుద్రూర్, మార్చి 28: రుణమాఫీపై రుద్రూర్ విండో పాలకవర్గాన్ని రైతులు నిలదీశారు. సొసైటీలో 210 మంది రైతులు ఉంటే కేవలం 78 మందికి రుణమాఫీ వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 90వ మహాజన సభ రసాభాసగా మారింది. రుణమాఫీ తమకు వర్తించలేదని కొంత మంది రైతులు ప్రశ్నించగా త్వరలో మాఫీ వస్తుందని కార్యదర్శి లక్ష్మణ్ సమాధానం ఇచ్చారు.
ఎరువులు కూడా కొంతమందికే అందాయని సభాదృష్టికి తీసుకెళ్లగా.. ముందుగా అడ్వాన్స్ ఇచ్చినవారికి పంపిణీ చేసినట్లు కార్యదర్శి బదులివ్వడంతో రైతులు మండిపడ్డారు. చిన్నరైతులకు అందడంలేదని వాపోయారు.కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతుల జాబితా ఇవ్వాలని పలువురు కోరగా.. తమ వద్దలేని కార్యదర్శి చెప్పడంతో రైతులు మండిపడ్డారు. ఈ సారైనా కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ముందుగా కోతకోసిన రైతుల ధాన్యాన్ని మాత్రమే సేకరించాలని రైతులు కోరగా.. విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి ఒప్పుకొన్నారు.