నాగిరెడ్డిపేట, ఆగస్టు 23: ‘ఇక్క డ పైసలిస్తేనే పని చేస్తరు.. దళారీతో వస్తే దర్జాగా పని అవుతది..ప్రశ్నిస్తే పనులు కావు.. ఎవరికైనా చెప్పు కో పో అంటూ బెదిరిస్తారు’ అంటూ నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయం ఎదుట పలువురు రైతులు, బాధితులు శుక్రవారం బైఠాయిం చి నిరసన తెలిపారు. ఈ సం దర్భంగా బాధితులు మాట్లాడుతూ దళారులతో వెళ్తేనే తహసీల్దార్ లక్ష్మణ్ పనులు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన కుమ్మరి అంజయ్య ఇల్లరికం వచ్చిన తన అల్లుడు కుమ్మరి పరమేశ్ ఆధార్ కార్డు ఇక్కడికి మార్చుకున్నాడని, లోకల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారన్నారు. డిగ్రీ చ దువు కోసం కులం, ఆదాయం సర్టిఫికెట్లు కావాలని దరఖాస్తు చేసుకోగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం అడిగితే సర్టిఫికెట్లు ఇవ్వనని, ఎవరికైనా చెప్పుకోండని బయటికి పంపించినట్లు ఆవేదన వ్యక్తంచేశారు. పట్టా మార్పిడి చేయాలని మూడు నెలలుగా తిరుగుతున్నా చేయకుండా తిప్పుతున్నారని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన బాలయ్య తెలిపారు.
ఇక్కడంతా డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని.. పలువురు రైతులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కార్యాలయంలో తండ్రి స్థానంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నీ తానై పనులు చక్కబెడుతున్నారని బాధితులు పేర్కొంటున్నారు. దాదాపు ఆరునెలలుగా ఈ తంతు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మణ్‌ను వివరణ కోరగా తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోవడం లేదని, రికార్డులో ఉన్నట్లు, నిబంధనల ప్రకారం పనులు చేస్తున్నానని తెలిపారు. నాకు తెలియకుండా నా పేరిట ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తహసీల్ కార్యాలయంలో పైసలు ఇస్తే నే పనులు చేస్తున్నారు. నెలరోజుల క్రితం మా తండ్రి పేరున ఉన్న వ్యవసాయ భూమి ని అన్నదమ్ములపై మార్పిడి చేసుకోవడానికి రూ.15వేలు డిమాండ్ చేసిండ్రు. ఇవ్వకపోతే చుట్టూ తిప్పుకుండ్రు. రూ.12వేలు ఇస్తేనే పని చేసిండ్రు. ఇప్పుడు అల్లుడు పరమేశ్‌కు నివాసం సర్టిఫికెట్ ఇచ్చారు. కులం, ఆదాయం సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఇబ్బంది పెడ్తుండ్రు. గట్టిగా అడిగితే బయటికి పొమ్మంటున్నరు.
– కుమ్మరి అంజయ్య, నాగిరెడ్డిపేట
మా అత్తమ్మ సత్తమ్మ చనిపోయింది. ఆమె పేరున 12గుంటల భూమి ఉన్నది. కూతురు ఎల్లవ్వ ఒక్కతే వారసురాలు. మరణధృవపత్రం కూడా తెచ్చిన. మూడు నెలలుగా ఏవేవో కారణాలు చెబు తూ.. పట్టామార్పిడి చేయడం లేదు. డబ్బు లు తీసుకొని ఫలానా వ్యక్తి తో వస్తే పని అయిపోతదని ఇక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు. నేను డబ్బు లు ఇచ్చే పరిస్థితిలో లేను. కలెక్టర్ దగ్గరికి వెళ్లి కాళ్లయినా పట్టుకుంటా కానీ, ఇక్కడ డబ్బులు ఇచ్చి పనిచేసుకోను.
– గులపల్లి బాలయ్య, ధర్మారెడ్డి గ్రామం