రామారెడ్డి, నవంబర్ 20: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. చాలా రోజుల తర్వాత గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు పరాభవం ఎదురైంది. యాసంగి బోనస్ ఎగవేతతో పాటు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రామారెడ్డిలో మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వడంలో వైఫల్యం, రైతుబంధు, రైతుబీమా సక్రమంగా అమలు కాకపోవడం వంటి సమస్యలను అన్నదాతలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కష్టాలు వెళ్లబోసుకున్న కర్షకుల నుంచి వినతిపత్రం స్వీకరించిన సీతక్క వారిని అవమానించేలా మాట్లాడారు. సమస్యలు ఉంటే వచ్చి కలవాలని, ఇలా రోడ్డుపై ఆపడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. మీరు రైతులా.. లేక బీఆర్ఎస్ నాయకులా? అని ప్రశ్నించడంతో అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కారు దిగిన సీతక్కకు వినతిపత్రం సమర్పించినన రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. గత యాసంగిలో సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, రైతుబంధు, రైతుబీమా సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. ఈసారి కూడా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, కాంటాలు కావడం లేదని, సకాలంలో డబ్బులు రావడం లేదన్నారు. ఇటీవల భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇస్తామన్న నష్ట పరిహారం ఇప్పటిదాకా ఇవ్వలేదన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
కామారెడ్డి, భిక్కనూరు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కోసం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గురువారం కామారెడ్డి జిల్లాకు వచ్చారు. అయితే, ఇటీవల పితృవియోగం కలిగిన మలావత్ పూర్ణను పరామర్శించాలని భావించిన మంత్రి.. రామారెడ్డి మీదుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి బయల్దేరారు. అయితే, అప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని ఎండగడుతూ నిరసన చేసేందుకు రామారెడ్డి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద రామారెడ్డి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే మంత్రి కాన్వాయ్ అటుగా రావడంతో అడ్డుకున్నారు.
కామారెడ్డి, నవంబర్ 20: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క గురువారం సిరికొండ మండలం పాకాల గ్రామానికి వెళ్తుండగా.. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆరుగురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. రామారెడ్డి మండలానికి చెందిన నాయకులు పడిగల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ కొత్తొళ్ల గంగారాం, బాలదేవ్ అంజయ్య, ద్యాగల మహిపాల్, హన్మయల్ల రాజయ్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.
రైతుల నుంచి వినతిపత్రం తీసుకున్న మంత్రి సీతక్క వారిపై అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే వచ్చి కలవాలని, ఇలా రోడ్డు మీద కాన్వాయ్‌ను ఆపడం సరికాదన్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కదా? అని ప్రశ్నించగా, రైతులు లేదని చెప్పారు. తమ మండలంలో ఎవరికీ రాలేదని, కావాలంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అన్నదాతలను అవమానించేలా మాట్లాడిన మంత్రి.. మీరు బీఆర్ఎస్ నాయకుల్లా ఉన్నారు, అసలు మీరు రైతులేనా? అని ప్రశ్నించారు. దీంతో అన్నదాతలు ఆమెపై ఒకింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు వచ్చి రైతులను పక్కకు తీసుకెళ్లడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం వరకూ వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద కూర్చోబెట్టారు. మంత్రి సిరికొండకు వెళ్లి, అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లిపోయినప్పటికీ రైతులను వదిలిపెట్టలేదు. పైగా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఆరుగురు
రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ గోడు వెల్లబోసుకునేందుకు వచ్చిన రైతులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రామారెడ్డిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గురువారం రాత్రి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ.. బోనస్ రావడం లేదని, రైతుబంధు, రైతుబీమా అమలు కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో తప్పేముందన్నారు. ఇక్కడ సానుకూలంగా స్పందించిన మంత్రి.. కామారెడ్డికి వెళ్లాక కించపరిచేలా మాట్లాడారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు తాగి కాన్వాయ్కి అడ్డంగా వచ్చారని అనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాన్వాయ్‌ని అడ్డుకున్నాడని మంత్రి చెప్పారని, కానీ ఆయన అసలు ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. గిరిజన బిడ్డ అయిన సీతక్క.. మాల, మాదిగలను హేళన చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. పూర్తి సమాచారం తెలువకుండా మిడిమిడి జ్ఞానంతో రైతులను బీఆర్ఎస్ నాయకులని అనడం తగదన్నారు. రైతులను వంగమాగదులు అన్న సీతక్క, షబ్బీర్ అలీ తమ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమిస్తామన్నారు.