నస్రుల్లాబాద్, అక్టోబర్ 25: ధాన్యం తీసుకోని రైస్‌మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్‌దేవ్‌పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క్రాస్ రోడ్డు వద్ద బాన్సువాడ -బోధన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నస్రుల్లాబాద్ సొసైటీ పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించిన రైస్‌మిల్లులకు తరలిస్తుండగా, కొంతమంది మిల్లర్లు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోకుండా తిరస్కరిస్తున్నారని రైతులు వాపోయారు. సుగుణ, గిరిధారి ఇండస్ట్రీస్‌లకు ధాన్యం అలాట్మెంట్ కాగా, సుగుణ ఇండస్ట్రీస్ యాజమాన్యం ధాన్యాన్ని తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
బొమ్మన్‌దేవ్ పల్లి గ్రామానికి చెందిన వడ్లు వద్దని, వాటిని తాము తీసుకోబోమని యాజమాన్యం చెప్పడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్ సువర్ణ అక్కడికి చేరుకొని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని, ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. సుమారు రెండున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఈవో శ్రీనివాస్,డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఏవో మోహన్ రెడ్డి, ఏవో భవానీ తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు బొమ్మన్‌దేవ్‌పల్లి కొనుగోలు కేంద్రానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. వడ్లను అన్లోడ్ చేసుకోని రైస్ మిల్లులను సీజ్ చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కాంటా పెట్టి రైస్‌మిల్లులకు తరలించి ఓటీపీ వచ్చే వరకు సొసైటీ వారు ఎంత తరుగు తీస్తున్నారో తెలియడం లేదని, తూకం వేసిన వెంటనే రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరుగును భరించాలంటూ సొసైటీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. క్వింటాలు ధాన్యానికి నాలుగు కిలోల తరగు తీస్తున్నారని వాపోయారు.
గతంలో ఎక్కువ మొత్తంలో ఔటన్ వచ్చినప్పుడు రైతులకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా అని అధికారులను నిలదీశారు. రైస్ మిల్లర్లు నష్టం గురించి చెబుతున్నారని, కానీ వారికి లాభాలు వచ్చినప్పుడు చెబుతున్నారా అని ప్రశ్నించారు.రైతులకు ఉపయోగపడని రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులకు బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామం నుంచి సమానంగా ధాన్యం లారీలను పంపాలని జిల్లా అధికారులు ఆదేశించారని తెలిపారు. ప్రతి రైతు నుంచి 40.600 కిలోల ధాన్యం బస్తాలు మాత్రమే ఇస్తామని, ఎక్కువగా ఇవ్వాలని తమపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికారులను కోరారు.
పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా, తమకు న్యాయం చేయాలని ఓ రైతు స్థానిక ఎస్సై రాఘవేంద్ర కాళ్ల మీద పడ్డాడు. మరో రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. అయితే, బీర్కూర్ ఎస్సై మహేందర్.. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, మా బాధలు మీకు ఓవర్ యాక్షన్‌లాగా కనిపిస్తున్నాయా? అని రైతులు ప్రశ్నించారు. అంతలో ఓ విలేకరి ఫొటోలు తీస్తుండగా, పెండ్లి ఫొటోలు తీస్తున్నారా అని ఎస్సై వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో రైతులు అతనితో వాగ్వాదానికి దిగారు.