బోధన్, జూన్ 22 : రైతన్నలకు మళ్లీ పదేండ్ల క్రితం నాటి రోజులు వచ్చాయి. ఎరువుల కోసం పడిన కష్టాలు పునరావృతమవుతున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలను సాగుచేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో ఎరువులు, పెట్టుబడి సాయం, 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్పించడంతో వ్యవసాయాన్ని పండుగలా మార్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ‘సాగు’ భారంగా మారింది. గతేడాది వానకాలంలో మాదిరిగానే మళ్లీ ఈసారి కూడా ఎరువుల కష్టాలు తప్పడంలేదు. నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్నది. సహకార సంఘాలకు అరకొరగా యూరియా సరఫరా చేయడంతో రైతులందరికీ అందడంలేదు. దీంతో ఎక్కడ చూసినా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తుండడం గమనార్హం.
నిజామాబాద్ జిల్లాలో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. మరోపక్క జిల్లాలోని బోధన్, వర్ని, కోటగిరి, చందూర్, మోస్రా, రుద్రూర్ తదితర మండలాల్లో నాట్లు పూర్తయి 20 రోజులవుతున్నది. వరి నాట్లు వేసిన తర్వాత యూరియా అవసరం ఎంతో ఉంటుంది. సరైన సమయంలో యూరియా ఎరువు వేయకపోతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. సరిగ్గా రైతులకు అవసరం ఉన్న ఈ కాలంలో యూరియా ఎరువు కొరత వేధిస్తున్నది. కొన్ని సింగిల్ విండోలు, ప్రైవేట్ డీలర్ల వద్ద సరిపడా యూరియా లేకపోవడంతో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పాలకులకు, అధికార యంత్రాంగానికి ముందుచూపు కొరవడడం, అవసరాలకు తగ్గట్టుగా ఎరువులను తెప్పించుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
గతేడాది కూడా ఇదే విధంగా జిల్లాలోని కొన్నిచోట్ల యూరియా కొరత ఏర్పడింది. కనీసం గతేడాది అనుభవాల నుంచైనా పాలకులు గుణపాఠం నేర్చుకోకపోవడం శోచనీయం. ఈ వానకాలంలో ఉమ్మడి జిల్లాలో 7.48 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. దీంతో ఎరువుల అవసరం గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా ఉమ్మడి జిల్లాలో ఎరువుల స్టాక్ లేదు. ఈ సీజన్‌కు 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రారంభ నిల్వలు 33, 609 మెట్రిక్ టన్నుల మేరకు ఉంది. ప్రస్తుతం 17,269 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎరువుల నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఆ మేరకు నిల్వలు లేవని తెలిసింది.
ఎరువుల డీలర్లు ఎప్పటికప్పుడు పీవోఎస్ యంత్రాల్లో అమ్మిన ఎరువుల వివరాల నమోదుచేయకపోవడంతో ఎరువుల నిల్వలు లేనప్పటికీ, ఉన్నట్లుగా చూపిస్తున్నదని పలువురు అంటున్నారు. సొసైటీల్లో వచ్చిన ఎరువులు ఎప్పటికప్పుడు నిండుకుంటున్నాయి. ఉద యం ఎరువుల స్టాక్ రాగానే, రైతులు ఎగబడుతున్నారు. సగం మంది రైతులకు ఎరువులు ఇవ్వగానే స్టాక్ అయిపోతున్నది.
ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండగా.. సొసైటీల చుట్టూ తిరగాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని సొసైటీల్లో ఎరువులతో పాటు వారికి అంతగా అవసరంలేని కొన్ని మందులను అంటగడుతున్నారని, వాటిని కొంటేనే ఎరువులు ఇస్తామని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల డీలర్లపై రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు.
యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నా. ఇప్పటివరకు యూరియా దొరకలేదు. రెండు, మూడు రోజులకోసారి యూరియాను సొసైటీకి పంపతు న్నారు. వచ్చింది వచ్చినట్లు అయిపోతున్నది.. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఒకేసారి ఎరువులు తీసుకుని నిల్వ చేసుకుంటాం. అయితే, ఇప్పుడు సీజన్‌కు సంబంధించిన ఎరువు ఒకేసారి తీసుకునే పరిస్థితి లేదు. కనీసం ఇప్పుడు వేసే యూరియాకు కూడా తిరగక తప్పడంలేదు.
– బంతి మోతీలాల్, రాజీవ్‌నగర్ తండా
పొతంగల్, జూన్ 22: అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఎరువుల కోసం సొసైటీ గోదాంకి వెళ్లిన ప్రతిసారి స్టాక్ అయి పోయిం దని అంటున్నారు. నాకు ఎనిమిదెక రాల భూమి ఉంది. దీంతోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. ఎరువుల కోసం వెళ్లిన ప్రతిసారి ఎరువులు లేవు.. ఉదయం లోడ్ వస్తుందని చెబుతున్నరు. ఉదయం వెళ్లేసరికి యూరియా కోసం బారులు తీరుతున్నారు. గతంలో ఇలాంటి సమస్య ఎన్నడూ ఎదురుకాలేదు.
– ఎస్.సాయిలు, రైతు, పొతంగల్