భీమ్‌గల్, జూలై 15 : ఎస్సారెస్పీలోకి ఎదురేగి వస్తున్న కాళేశ్వరం జలాలు సందర్శకులను కనువిందు చేస్తు న్నాయి. జలసిరుల సందర్శనకు వచ్చి న రైతులు చూసి మురిసిపోతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్, చేంగల్, రూప్లాతండా, ఎంజీ తండాల గ్రామాల రైతులు ఐదు బస్సుల్లో శనివారం సందర్శనకు వచ్చారు. జలాలను చూస్తూ సంతోషంగా సెల్ఫీలు తీసుకొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కాళేశ్వర జలాలను ఎస్సారెస్పీలోకి ఎదురెక్కించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రోడ్డు, భవనాలు, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఈ సందర్భంగా రైతులు కొనియాడారు. వట్టిపోతున్న ఎస్సారెస్పీకి జలదాతలు వీరుఅని గర్వ కారణంగా ముచ్చటించుకొన్నారు. పంపుహౌస్ సందర్శనకు వచ్చిన రైతులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన సొంత ఖర్చులతో భోజనాలను ఏర్పాటు చేశారు. పంప్‌హౌస్‌లో భారీ స్క్రీన్‌పై ఎస్సారెస్పీ కాళేశ్వర జలదృశ్యాలను వీక్షీస్తూ భోజనాలు చేశారు.
కాళేశ్వర జలాలతో పంటలకు ఢోకాలేదు
కాళేశ్వర జలాలతో పంటల సాగుకు ఢోకా లేదు. గతంలో గ్రామాల పక్క నుంచి వరద నీరు పారుతున్నా చుక్కనీరు గ్రామాల్లోకి వచ్చేదికాదు. ప్రస్తుతం పైప్‌లైన్ ద్వారా గ్రామాల్లోని చెరువుల్లోకి వరద నీరు చేరడం ఎంతో సంతోషంగా ఉంది. చెరువుల్లో నీరు చేరడంతో పంటల సాగుకు ఇబ్బందులు ఉండవు. మా సాగునీటి కష్టాలు తీర్చిన మంత్రికి కృతజ్ఞతలు.
– జక్క నర్సారెడ్డి, లక్కోర
మంత్రికి రుణపడి ఉంటాం
గ్రామంలో శాశ్వతంగా సాగు, తాగు నీటి సమస్యకి పరిష్కారం చూపిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి గ్రామస్తులు రుణపడి ఉంటారు. తమ గ్రామ సమీపం నుంచి వరద కాలువ ప్రవహిస్తున్నా కాలువ నుండి నీటిని వాడుకుంటే గతంలో కేసులు నమోదు చేశారు.ప్రస్తుతం ప్రభుత్వమే కాలువకు తూమును ఏర్పాటు చేసి పైప్‌లైన్ ద్వారా చెరువులలోకి నీరును మళ్లిస్తున్నారు.
– రాజేశ్వర్‌రెడ్డి, అంక్సాపూర్ సర్పంచ్
మహారాష్ట్రపైనే ఆధారపడేది
పోచంపాడ్ నిండాలంటే పైన ఉన్న మహారాష్ట్రపైనే ఆధారప డేది. కానీ.. ఇప్పుడు రివర్స్ పంపింగ్ ద్వారా కింద ఉన్న నీటితో శ్రీరాంసాగర్‌ను నింపుతున్నారంటే దీనంతటికి కారణం సీఎం కేసీఆర్, మంత్రి వేముల కృషి. రైతులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీరు అందిస్తున్నారు. నేను ఓ రైతుగా చెబుతు న్న ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– గంపాయి రాజగంగారాం, రైతు, బడా భీమ్‌గల్
భూగర్భ జలాలు పెరుగుతాయి
కాళేశ్వర జలాలతో గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షాలు సమృద్ధిగా కురువక పోయినా కాళేశ్వర జలాలు గ్రామాల్లోని చెరువుల్లోకి వస్తున్నాయి. దీంతో గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో తాగునీటికి ఇబ్బందులు ఉండవు
– విఠల్, వేల్పూర్
రైతులందరం రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి రైతులందరం రుణపడి ఉంటాం. కింది నుంచి నీళ్లను పైకి తీసుకచ్చి రైతు కష్టాలు తీర్చారు. పోచంపాడ్‌ను కింద ఉన్న నీళ్లతో నింపుతారని ఎన్నడూ కూడా ఊహించలేదు. నిజంగా ఇది అద్భుతం. రైతులు తమ పంటలకు నీళ్ల అవసరాలని తీర్చిండ్రు.
– రాగుల లింబాద్రి, రైతు, బడా భీమ్‌గల్
రైతుల సాగు కష్టాలు తీరుతాయి
కాళేశ్వరం నీళ్లతో రైతుల సాగు కష్టాలు తీరుతాయి. కాళేశ్వరం నీళ్లు వచ్చి పోచంపాడ్‌లో కలుస్తున్నా యంటే సుద్దామని పోతున్న. ఎన్నడూ సూడలేదు పోచంపాడ్‌ను కింద ఉన్న నీటితో నింపిండ్రని. చాలా సంతోషంగా ఉంది.
– ముచ్కూర్ ప్రవీణ్, రైతు, బడా భీమ్‌గల్