జక్రాన్పల్లి, ఏప్రిల్ 29 : మండలంలో ఏర్పాటు చేస్తామన్న ఎయిర్పోర్ట్కు తమ పట్టా భూములు ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలం చుట్టూ ఉన్న జక్రాన్పల్లి, మనోహరబాద్, కొలిప్యాక్, తొర్లికొండ, అర్గుల్ గ్రామాల రైతులు కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వ భూమితోపాటు తమ భూములు కూడా తీసుకుంటున్నారని తెలిపారు. అక్కడున్న రైతులకు రెండు మూడెకరాలకు మించి భూమి లేదని, ఉన్న ఆ భూమిపై ఆధారపడ్డామని, అది కాస్త తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. ప్రభుత్వ భూమిలోనే ఎయిర్పోర్ట్ నిర్మించాలని, తమ పట్టా భూములు మాత్రం ఇవ్వబోమంటూ ఎమ్మెల్యేతో స్పష్టం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ..ఇది తాను నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాదని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని, కానీ కచ్చితమైన హామీ మాత్రం ఇవ్వలేనని, తన ప్రయత్నం తాను చేస్తానని రైతులతో పేర్కొన్నారు.