రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఫోన్లు మంగళవారం ఉదయం టంగ్ టంగ్మంటూ మెసేజ్ల మోత మోగాయి. ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు (వానకాలం-2023) పథకం ద్వారా రూపాయలు…. మీ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి..’ అంటూ వచ్చింది. మెసేజ్ చూసిన రైతుల ముఖాల్లో ఆనందం కనిపించింది. సమీపంలోని బ్యాంకులకు వెళ్లి కేసీఆర్ పైసలొచ్చాయంటూ సంతోషంగా నగదును విత్ డ్రా చేసుకున్నారు.
డబ్బులు వేయడం హర్షణీయం..
ధర్పల్లి, జూన్ 27: వానకాలం ప్రారంభంతోనే సర్కారు రైతుబంధు డబ్బులు వేయడం హర్షణీయం. పంట పంటకూ పెట్టుబడి సాయం కింద కేసీఆర్ సార్ డబ్బులు అందించడంతో మాలాంటి రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. సీఎం కేసీఆర్ రైతుబంధు పైసలు ఇవ్వడంతో వ్యవసాయ ఖర్చులు, ఎరువుల కొనుగోలుకు ఎలాంటి బాధలు లేకుండా పోయాయి. గతంలో సీజన్ వచ్చిందంటే భయం వేసేది. ఎవరి దగ్గరికి వెళ్లాలి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలనే ఆలోచనతో భయంగా గడిచేది. కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు.
– ఏనుగు బాల్రెడ్డి, రైతు, మైలారం
ఇబ్బందులు పోయాయి..
ధర్పల్లి, జూన్ 27: ప్రతి పంటకూ రైతుబంధు అందించడంతో ఇబ్బందులన్నీ పోయాయి. వానకాలం, యాసంగి సీజన్లకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయం. దీంతో మాకు (రైతులకు) తిప్పలనేటివి తెల్వకుండా పోయాయి. గతంలో గంజిలకు పోయి డబ్బులు బాకీ తెచ్చుకొని పంట వేసుకునేవాళ్లం. తిరిగి పంట విక్రయించేటప్పుడు మిత్తికి మిత్తి వేసి కట్టించుకునేవారు. పంట అమ్మినప్పుడు చేతికి అంతంత మాత్రమే వచ్చేది. కానీ రైతుబంధుతో ఇప్పుడు ఆ ఇబ్బందులు పోయాయి.
– జంగిటి పెద్ద పోశన్న, రైతు, సీతాయిపేట్ గ్రామం
కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు ఢోకా లేదు..
ధర్పల్లి, జూన్ 27: కేసీఆర్ లాంటి వ్యక్తి సీఎంగా ఉన్నన్ని రోజులు రైతులకు ఎలాంటి ఢోకా ఉండదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితోనే అంతా రైతు మాట మాట్లాడుతున్నారు. అంతకుముందు రైతుల గురించి పట్టించుకున్న నాథుడే లేడు. సీఎం కేసీఆర్ వచ్చినంక రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు అందించడంతో రైతుల పాట్లు దూరమయ్యాయి. రైతుల కోసం పాటుపడుతున్న సీఎంకు కృతజ్ఞతలు.
– పాపయిగారి గంగారెడ్డి, రైతు, మైలారం
కేసీఆర్కు రుణపడి ఉంటాం..
పంటల సాగుకు పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. పంటలు వేసే సమయంలో విత్తనాలు, ఎరువులకు పైసల కోసం పడరాని పాట్లు పడేవాళ్లం. ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేయడంతో సంతోషంగా ఉన్నది. నా ఖాతాలో పడ్డ పైసలతో విత్తనాలు, ఎరువులు కొంటాను.
– దండెబోయిన పోశెట్టి, రైతు, తిమ్మాపురం,
గాంధారి మండలం సమయానికి పైసలొచ్చినయ్..
తాడ్వాయి, జూన్ 27: పంట సాగు సమయానికి రైతుబంధు పైసలు వచ్చాయి. నాబ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడడంతో ఆ పైసల్తోని మక్కల బస్తా కొన్నా. సీఎం కేసీఆర్ సమయానికి పైసలు వేయడంతో అప్పు అడిగే తిప్పలు తప్పాయి. రైతుల పాలిట దేవుడిగా సీఎం కేసీఆర్ మారారు.
– బెస్త నర్సయ్య, రైతు, బ్రాహ్మణపల్లి
ఖాతాలో పైసలు వడ్డయ్..
లింగంపేట, జూన్ 27: వానకాలం, యాసంగిలో పంట పెట్టువడికి పైసలు కావాల్నంటే వడ్డీ వ్యాపారులను అడిగేటోళ్లం. వాళ్లు ఇస్తారన్న నమ్మకూడా ఉండేది కాదు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టి ప్రతి పంటకు పెట్టుబడి సాయం చేస్తుండ్రు. నా ఖాతాలో ఈరోజు డబ్బులు పడ్డాయి. విత్తనాలు, ఎరువులు కొనడానికి వచ్చిన.
– మన్నె సువర్ణ, ఐలాపూర్
విత్తనాలు కొనుగోలు చేశా..
లింగంపేట, జూన్ 27:రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులతో విత్తనాలు కొనుగోలు చేశాను. వానలు కురిసినందున వ్యవసాయ పనులు ప్రారంభించి దుక్కి దున్ని పెట్టుకున్నా. రైతుబంధు పథకం మా రైతుల పాలిట వరంగా ఉంది. గతంలో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది.
-ఛత్రపతి రాజాగౌడ్, లింగంపేట.
కేసీఆర్ రైతు బాంధవుడు..
లింగంపేట, జూన్ 27: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తి. రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతులకు కుటుంబ పెద్దగా ఉంటూ సకాలంలో పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నారు. పంట పంటకూ పెట్టుబడికి సరిపడా డబ్బులు అందిస్తున్నారు. రైతుల పాలిట దేవుడు కేసీఆర్.
– గొల్ల రుకుంబాయి, మెంగారం
సరైన సమయంలో పైసలందినయ్..
గాంధారి, జూన్ 27: రైతుల మేలు కోరి పంట పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం పైసలు సరైన సమయంలో అందాయి. పంటలను సాగు చేసే సమయంలో రైతుబంధు పైసలు రావడంతో పెట్టుబడి డబ్బుల కోసం రంది పడాల్సిన బాధ తప్పింది. ఇప్పుడు వచ్చిన పైసలతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తా. పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరచిపోను.
-కాయితీ పర్వయ్య, రైతు, తిమ్మాపురం, గాంధారి మండలం
సంతోషంగా ఉన్నది..
తాడ్వాయి, జూన్ 27: మేము వ్యవసాయం చేయడంలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని, మమ్మల్ని ఆదుకోవడానికే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టారు. రైతును రాజు చేస్తానని చెప్పిన కేసీఆర్ రైతులు బాధ పడకుండా ఉండేలా చూస్తున్నారు. రైతుబంధు పైసలతో విత్తనాలు, ఎరువులు కొంటున్నాం.
-రాజిరెడ్డి, రైతు, బ్రాహ్మణపల్లి
అప్పులు లేకుండా సాగు..
నాగిరెడ్డిపేట్, జూన్ 27: సీఎం కేసీఆర్ చెప్పినట్టే వ్యవసాయానికి పెట్టుబడిసాయం అందజేస్తుండు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు. పెట్టుబడి సాయం అందడంతో అప్పులు లేకుండా నిమ్మలంగా వ్యవసాయం చేస్తున్నాం.
-షఫీ, గోపాల్పేట్