మోర్తాడ్, జూన్ 21: విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయని, మరోవైపు అధికారులు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తూ సాగునీటిని అందించుకోకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ విద్యుత్ సరఫరాలో కూడా నిత్యం కోతలు విధిస్తున్నారని, సమస్యను అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
విద్యుత్ డీఈ వచ్చేవరకు కదిలేది లేదని, సమస్య పరిష్కరించే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని బైఠాయించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు నాలుగు రోజులు గడువివ్వాలని కోరడంతో ఆందోళన విరమించారు. బుధవారం నాటికి వ్యవసాయానికి, ఇండ్లలోకి వచ్చే విద్యుత్ విషయంలో అంతరాయం లేకుండా చూడాలని, అప్పటివరకు వేచి చూస్తామని, లేదంటే మరోసారి ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు.