కాంగ్రెసోళ్ల కాలంల పడ్డ కష్టాలు చాలు. కరంటు కోసం నడిమి రాతిరి పొలాల పొంటి తిరిగింది చాలు. కరంటు షాకుతో సచ్చిపోయిన తోటి రైతులు ఇంకా గుర్తుకున్నరు. యాది జేసుకుంటే కండ్లళ్ల నీళ్లు తిరుగుతున్నయ్. పదేండ్లల్ల అవన్నీ మర్సిపోయేటట్లు జేసిండు కేసీఆరు సారు. అంటే అంత మంచి కరంటు ఇచ్చిండు. ఆయన పుణ్యాన పొలాలకు రికాం లేకుంట కరంటు అస్తున్నది. గీ పదేండ్ల సంది పొలాలు ఎండుడనే ముచ్చటనే లేదు. ఎక్కడ జూసినా పచ్చగున్న పొలాలే కనిపిస్తున్నయ్. మా రైతుల ముఖం జర్రంత మంచిగైంది. పుక్యం ఇస్తున్న కరంటుతో పంటలు మస్తుగ పండి మా బతుకులు దార్లకొచ్చినయ్. ఇంత ముందుకు పోతున్న టైంలనే మళ్ల దిగిండు గా కాంగ్రెసోడు. అధికారంలకు అచ్చేతందుకు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుండు. ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు వాని ముఖానికి మా పంటలకు మూడు గంటల కరంటు సాలని చెబుతున్నడు. గదేదో 10హస్పర్ల మోటరు వెట్టుకోవాల్నని అంటున్నడు. వాడికేం ఎరుక. ఎరుకలేనోడికి ఎద్దునిస్తే… ఉరికిఉరికి బాయిల వడ్డట.. అట్లున్నది. అందుకే గా కాంగ్రెసోళ్లకు పగ్గాలు ఇచ్చేది లేదు. వాళ్లను గెలిపిచ్చేది లేదు. మాకు రంది లేకుంట జేసిన కేసీఆరు సారే మా బంగారం. మా రైతు బిడ్డ కేసీఆరును మళ్లా సీఎంను జేస్తం. ఇది మా రైతులందరి మాట. అంటూ తమ మనోగతాన్ని నమస్తే తెలంగాణతో పంచుకున్నారు పలువురు రైతులు. వారి మాటల్లోనే..
కాంగ్రెస్ పాలనలో పంటలకు నీళ్లు పెట్టేందుకు కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక అరి గోస పడ్డాం. పంటను కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డమో మాకు తెలుసు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నది. రెండు పంటలకు సరిపడా నీరు అందుతున్నది. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండు. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంట్ చాలంటే పంటలు పండుతయా? రైతు అగం కావాలనే 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకొమ్మంటున్నరు. కాంగ్రెసోళ్లు మళ్లీ రైతులను ఇబ్బందిపెట్టడం కాకపొతే ఇంకేంటి? రైతులు బరాబర్ బీఆర్ఎస్కే మద్దతుగా నిలుస్తరు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోసం ఎదురుచూస్తూ పొలం కాడనే కావలి ఉండాలె. ఒక గుంట పారుతది.. ఒక గుంట ఎండుతది. రైతులు మస్తు గోసవడ్డరు. గా బాధలు పోయి పదేండ్లాయె. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఫ్రీ కరెంటు చాలా బాగుంది. 3 గంటల కరెంటు ఇస్తే ఏం జేసుకోవాలె. 10 ఎస్పర్ మోటరు పెడితే బోర్లల్ల, బాయిలల్ల నీళ్లుంటాయా? ఇప్పుడిప్పుడే రైతులు రంది లేని ఎవుసం చేస్తున్నరు. సమయానికి పెట్టుబడి సాయం అందుతున్నది. కరెంట్‌కు మీటర్లు లేవు. కరెంటు పోతలేదు. తీరికున్నప్పుడు పొలాలకు పోయి నీరు పారిస్తున్నం. మాకు 3గంటల కరెంట్ ముచ్చటనే వద్దు.
కాంగ్రెస్ అంటే భయం.. కేసీఆర్ అంటే రైతులకు భరోసా. పదేండ్ల కిందట కరెంటుతోని రైతులు ఎన్నో కష్టాలు చూశారు. ఒక్క గుంట నీళ్లు పారంగనే కరెంటు పోతుండె. కరెంటు ఎప్పుడస్తుండెనో తెల్వకుండె. సగం పంటలు ఎండిపోతుండె. మూడు గంటల కరెంటు సరిపోతది అంటున్న కాంగ్రెస్ మాటలకు రైతులు మోస పోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో గోసవడ్డ రోజులు అందరికీ తెలుసు. మళ్లీ 3 గంటల కరెంటు.. 10 హెచ్‌పీ మోటర్లు అని రెవంత్‌రెడ్డి రైతులకు చెప్తుండు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. రాత్రి కరెంటు.. పొద్దున కరెంటు అని ముప్పుతిప్పలు పెడ్తరు. రైతులను నిండా ముంచుతరు. రైతులు పొరపాటున కూడా కాంగ్రెస్‌ను తెచ్చి నెత్తిన పెట్టుకోవద్దు. సీఎం కేసీఆర్ మంచి కరెంటు ఇస్తున్నారు. బాధ లేకుండా పంటలు పండిస్తున్నం. బీఆర్ఎస్ సర్కారు వస్తేనే రైతులకు మంచిది.
దేశాన్ని, రాష్టాన్ని 60 ఏండ్లు పాలించినా కాంగ్రెస్‌కు అధికార దాహం తీరలేదు. వారి పాలనలో రైతులు ఏనాడూ సుఖంగా లేకుండె. ఇప్పుడేమో రేవంత్‌రెడ్డి హుషార్తనం చేస్తుండు. 3 గంటల కరెంటు.. 10 హెచ్‌పీ మోటర్లు అని చెప్తుండు. కానీ రైతులు కాంగ్రెస్‌ను నమ్మరు. ఎందుకంటే తెలంగాణ సర్కారు వచ్చినంకడే రైతులు అన్ని విధాలా సంతోషంగా ఉన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. వ్యవసాయానికి పుష్కలంగా నీరు ఉండబట్టే భూముల ధరలు బాగా పెరిగినయ్. కాంగ్రెస్ హయాంలో ఉన్న ధరలకు.. ఇప్పుడున్న ధరలకు పది రేట్లు తేడా ఉంది. పొలానికి నీరు మంచిగ అందడంతో దిగుబడి బాగా వస్తున్నది. వడ్ల ధరలు కూడా తెలంగాణ ప్రభుత్వం బాగా పెంచింది. కాంగ్రెసోళ్లు రైతులను ముంచేటట్టే ఉన్నరు. సాఫీగా సాగుతున్న వ్యవసాయాన్ని ఆగం చేసే ప్రయ్నతం చేస్తున్నరు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవు. అప్పట్లో కరెంటుతో అరిగోస పడ్డం. అది మర్చి పోలేదు. రాత్రుల్లు కరెంటు కోసం బ్యాటరీలైట్లు పట్టుకొని కావలి కాసేవాళ్లం. కరెంటు సక్కగ ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక కరెంటు పోతదనే బాధ లేదు. ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు పోయి బోరు వేసుకొని నీళ్లు పారిస్తున్నాం. తెలిసి..తెలిసి కాంగ్రెస్‌ను తెచ్చుకుంటమా? మా బతుకుల్ని ఆగం చేసుకుంటమా?
రెండు పంటలు తీస్తున్నమంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమే. 24 గంటల కరెంటుతో ధైర్యంగా సాగు చేసుకుంటున్నం. కరెంట్ ఉంటెనే పంటలకు నీళ్లందుతాయి. లేదంటే కష్టం. కాంగ్రెస్ సర్కారు వస్తే రైతులు గోస పడుడే. కరెంట్ ఇవ్వదు. నీళ్లు ఇవ్వదు. 3గంటల కరెంటు దేనికి సరిపోతది. వరి పండించాలంటే కనీసం 9 నుంచి 10 గంటల కరెంటు అవసరం. 3 గంటల కరెంటుతో 3 గుంటలు కూడా తడిపెట్టలేం. వారి మాటాలు వింటే వ్యవసాయం చేసినట్టే.
కొట్లాడి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్.. సాగుకు ఇస్తున్న నాణ్యమైన 24 గంటల త్రీఫేజ్ కరెంట్‌తో బీడు భూములు పచ్చగైనయ్.. గీ పదేండ్లలో రైతులను రాజులను చేసిండు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక నానా ఇబ్బందులు పడ్డం. కాంగ్రెస్ వాళ్లు 10 ఎస్పర్ మోటర్ పెట్టుకొమంటే నవ్వొస్తున్నది. అంత పెద్ద మోటర్లు కొనాలంటే మాటలా? చాలా ఖర్చవుతుంది. రేవంత్ మాటలు వింటే మాకు మళ్లీ కష్టాలే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి మా సత్తా చాటుతాం.
మాకు సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటే గావాలే.. కాంగ్రెసోళ్లు ఇచ్చే 3గంటల కరెంట్‌తో మోటర్లు నడవలేవు. మూడు గంటల కరెంట్ అద్దు.. గా కాంగ్రెస్ అసలే అద్దు. గతంలో కరెంట్ కోతలతోని అరిగోస పడ్డం. 10ఎస్పర్ మోటరు పెట్టు కోవాలంటున్నరు.. అవి పెడితే బోర్లల్ల నీళ్లు ఉంటయా? అవి పెట్టుకోవలన్నా మస్తు పైసలైతయ్. ఇప్పుడిస్తున్న 24 గంటల కరెంట్‌తో పొలాలు మంచిగ పండుతున్నయ్.
కేసీఆర్ సర్కారు వచ్చినంక 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తున్నది. ఏ కష్టం రానీయకుండా రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది. ఇప్పుడున్న కరెంటు చాలా బాగుంది. మాకు నచ్చినప్పుడు పొలానికి పోయి నీళ్లు పారిస్తున్నం. కరెంటు పోతదనే రంది లేదు. కాంగ్రెస్ నాయకులు 3 గంటలే కరెంటు ఇస్తరంట. వాళ్ల మాటలు వింటే ఆగమవుడే.. దాంతోని ఏ పొలం పారిస్తం. ఇది రైతులను మోసం చేసుడు కాదా? దస్ ఎస్పర్ మోటర్లు పెట్టుకోవాల్నంట.. రైతులు బాగుండాలని లేదా? అందుకే తప్పుడు మాటలతో తప్పుదోవ పట్టించాలని చూస్తుండ్రు. 10 ఎస్పర్ మోటర్లు పెట్టుకోవాలంటే ఎట్లా? ఈ మోటర్ నడిపిస్తే భూమిల నీళ్లుంటయా? ఈ తొమ్మిదేండ్లల్ల కరెంటు బాధలంటే ఏందో మర్చిపోయినం. గింతమంచి కరెంటియ్యంగ.. 3గంటల కరెంటిస్తం అనే కాంగ్రస్కు ఓటేస్తమా? ఒకవేళ ఏస్తే.. పరేషానే. బరాబర్ బీఆర్ఎస్నే గెలిపించుకుంటం.
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్, 10 హెచ్‌పీ మోటర్లు సరైంది కాదు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు బాధలు తప్పవు. మూడు గంటలే కరెంట్ ఇస్తే రైతులు నెత్తికొట్టుకోవాల్సి వస్తుంది. అసలు మూడు గంటల కరెంటు వ్యవసాయానికి ఎలా సరిపోతుంది. వానలు సరిగా లేకపోతే ఉన్న 5 హెచ్‌పీ మోటర్ల పరిస్థితే ఇబ్బందికరంగా ఉంటది. వాటిని తీసేసి 10 హెచ్‌పీ మోటర్లు ఎలా పెట్టుకోవాలి. వీటితో ఏం లాభం ఉంటుందో కాంగ్రెస్ నాయకులకే తెలియాలి. కొత్త మోటర్లు, మీటర్లు అంటే.. వీటి ఖర్చంతా ఎవడు పెట్టుకోవాలి.. మంచిగా ఉన్న వ్యవసాయాన్ని ఖరాబ్ చేసుకోవాలా ? కాంగ్రెస్ నాయకుల పనికిమాలిన మాటలు రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదు.. ఉన్న వ్యవసాయం కాపాడుకుని ఆనందంగా ఉండాలంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది. కోరి కష్టాలు కొనితెచ్చుకోం..
కేసీఆర్.. రైతుల బాధలు తెలిసిన సీఎం. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంటు కోసం రైతులు రోజూ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఉండేవి. ఆ విషయం రైతుగా కేసీఆర్‌కు కూడా తెలుసు. అందుకే రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోవడానికి 24 గంటల కరెంటును ఉచితంగా ఇస్తున్నారు. రైతుబంధు పేరిట పంటకు పెట్టుబడి ఇస్తున్నారు. చెరువులను బాగు చేసి నీళ్లు తెచ్చారు. పండించిన పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతులు చనిపోతే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా రైతుబీమా ఇస్తున్నారు. ఇవన్నీ రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ నిర్ణయాలే. ఇలాంటి పథకాలను గతంలో ఎవరూ తీసుకురాలేదు. అన్నీ బాగయ్యాక.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి 3 గంటల కరెంటు ఇస్తామని అంటున్నారు. రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తామని చెప్పడం సరికాదు. అలాంటి పార్టీలకు రైతులు మద్దతివ్వరు. మా రైతు కుటుంబాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకుంటాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు కరెంటు కష్టాలు తప్పవేమో. వారి హామీలు, మాటలు చూస్తే అనుమానంగానే ఉన్నాయి. మూడు గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పడం సరికాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు 5హెచ్‌పీ మోటర్లు పనిచేసేలా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వాటిపై భారం పడకుండా చర్యలు చేపట్టారు. అయితే, 10హెచ్‌పీ మోటర్లు ఏర్పాటు చేయాలని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు, అవగాహన లేకుండా రైతులను అయోమయానికి గురిచేసే విధంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో కేవలం 5హెచ్‌పీ మోటర్లు సరిపోతాయి. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. లో వోల్టేజీ సమస్య వస్తుంది. మోటర్లు కాలిపోతాయి. వేగంగా నీటిని తోడేయడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు కూడా త్వరలో వట్టిపోతాయి. ఈ ఆలోచన సరైంది కాదు, రైతులకు కూడా వ్యవసాయం, మోటర్లు, విద్యుత్ సరఫరా విషయంలో చాలా అవగాహన పెరిగింది. రైతులను అయోమయంలోకి నెట్టే ఆలోచనలు లేకుండా చూడాలి. మూడు గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పడం, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని చెప్పడం సరైంది కాదు. తిరిగి పాతరోజుల మాదిరిగానే కరెంటు, నీళ్ల కోసం రాత్రి సమయాల్లో పొలాల వద్ద పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ వారు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు కరెంటు కష్టాలు తప్పాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడు గంటల ఉచిత విద్యుత్ అని.. రెండు మూడు గంటలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. అదికూడా అర్ధరాత్రి ఇచ్చేవారు. కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియక రైతులు పొలాల వద్ద పడిగాపులు కాశారు. ఇప్పుడు ఆ కష్టాలేవీ లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలే విద్యుత్ ఇస్తానంటోంది. అదే జరిగితే రైతులకు మళ్లీ చీకటి రోజులు వచ్చినట్టే. అటువంటి పాడు రోజులు మాకొద్దు. ఆ కాంగ్రెస్ పార్టీ అసలే వద్దు. మాకు కేసీఆర్ సారే కావాలి. బీఆర్ఎస్నే గెలిపిస్తాం.
కాంగ్రెస్ పాలనలో అన్నీ కష్టాలే. కరెంటుండదు.. నీళ్లుండవు.. ఎరువులు ఇవ్వరు. కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి వేరే పనులు చేసేవారు. పంటలు పండించేందుకు నానా ఇబ్బందులు పడేవారు. రాత్రుళ్లు కరెంటు లేక పొలం గట్లపై పడుకొని పాముకాటుతో చాలా మంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి. కరెంటు కోసం రోజంతా పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. కరెంటు లేక.. నీళ్లు లేక పండించిన పంటలు కండ్ల ముందే ఎండిపోయేవి. తెచ్చిన అప్పులు తీర్చలేక, నోట్లోకి ముద్ద పోక ఆకలిచావులే మిగిలేవి. ఇలాంటి సమయంలో తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసింది. సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు, చెరువులు, కుంటల్లో పుష్కలంగా సాగునీరు ఉండడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు వస్తే రైతు బతుకు మళ్లీ చీకటే. మాకు బీఆరెస్ ప్రభుత్వమే కావాలి.
రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంటు ఇస్తామంటున్నడు. అలా అయితే కరెంటు ఎప్పుడొస్తదో.. ఎప్పడు పోతుందో తెల్వదు. పొలానికి నీళ్లు పారియ్యాలంటే కరెంటు కోసం ఎదురు చూస్తూ ఇంటికి రాకుండా శివార్లలోనే పండుకోవాలె. కరెంటు కష్టాలను రైతులు కొని తెచ్చుకోరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంది. రైతులకు కరెంటు బాధలు ఏమాత్రం లేవు. ఎప్పడు కావాలంటే అప్పుడు పొలానికి పోయి నీళ్లు పారిస్తున్నం. మిగితా పనులు కూడా చేసుకుంటున్నం. 3 గంటల కరెంటు.. 10 హెచ్‌పీ మోటర్లు అంటూ కొత్త విషయాలను రైతులతో చెప్తే ఎలా నమ్ముతారు. వ్యవసాయం గురించి రైతులకన్నా రేవంత్‌రెడ్డికి ఎక్కువ తెలుసా? రైతులను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ మాటలను రైతులు ఎప్పటికీ నమ్మం. రైతు చల్లగా ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలి.
మూడు గంటల కరెంటుతో వ్యవసాయం చేయలేం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు మా బతుకులు చీకట్లోనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ వచ్చాకనే బాగుపడ్డాం. 24 గంటల కరెంటు ఇవ్వడంతో సంతోషంగా పంటలు పండిస్తున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నాం. కాంగ్రెస్ 3 గంటల కరెంటు ఇస్తే ఒక్క మడి కూడా పారదు. వ్యవసాయం వదిలిపెట్టుకోవాల్సిందే. అప్పటి కరెంటు కష్టాలు మళ్లీ రావొద్దు. రాత్రి పూట బావుల వద్ద జాగారాలు చేశాం. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెసోళ్ల మాటలు వింటే మళ్లీ కష్టాలు మొదలైనట్టే.
రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటలపాటు ఫ్రీగా కరెంటు ఇస్తున్నడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్‌రెడ్డి 3 గంటలే కరెంట్ ఇస్తడంట. మంచిగున్న కరెంటును పాడుచేసుకోం. రైతులకు మంచి చేస్తున్న కేసీఆర్‌ను వదులుకొని.. కరెంటు కష్టాలు తెచ్చుకుంటమా.. పదేండ్ల నుంచి ఎలాంటి బాధలు లేకుండా హాయిగా పంటలు పండిస్తున్నం. మోటర్లు కాలిపోతలేవ్. పొలాలు ఎండిపోతలేవ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి నీళ్లు పారిస్తున్నం. వేరే పనులు కూడా చేసుకుంటున్నం. 3 గంటల కరెంటు.. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని ఎవుసాన్ని పాడు చేసుకుంటమా? లక్షల్లో పెడ్డుబడి పెట్టి పంటలు పండించాలంటే ఎట్లా? కాంగ్రెస్ మాటలింటే రైతులు బొందల పడుడే. దీనికన్నా బీఆర్ఎస్ను గెలిపించుకునుడు మంచిది .
కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నారు. బోరు బావులున్న ఉన్న రైతులకు చాలా సౌకర్యంగా ఉంటున్నది. పొలానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు పెట్టుకుంటున్నాం. ఎలాంటి ఇబ్బందీ లేదు. 24 గంటలపాటు కరెంటు ఉండడంతో రెండు పంటలు పండుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేశారు. వానలు బాగా కురవడంతో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. చెరువుల కింద కూడా రెండు పంటలు పండుతున్నాయి. కేసీఆర్ వచ్చాక రైతులకు కష్టాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3 గంటల కరెంటు సరఫారా చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పాడు. ఒక్క ఎకరానిక కూడా నీళ్లు పారవు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే చాలా ఖర్చతో కూడుకున్న పని. రైతులతో సాధ్యం కాదు. 24 గంటల కరెంటే బాగున్నది.