మొన్న లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తున్నామన్నారు.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే వేలాది మంది రైతులకు మాఫీ వర్తించలేదు. తాజాగా మలి విడుతలో రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. రెండో విడుత జాబితాలో పేరు ఉందేమోనని ఆశగా ఎదురుచూసిన అన్నదాతలకు భంగపాటే మిగిలింది. క్రాప్ లోన్ రూ.లక్ష కన్నా తక్కువ ఉన్నా తమకు మాఫీ కాలేదని రైతాంగం ఆందోళన చెందుతున్నది.
గ్రామాల వారీగా కుటుంబాలను ప్రాతిపదికన తీసుకుని తయారు చేసిన జాబితాలో చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు. కేసీఆర్ హయాంలోనే బాగుండే అని రైతులు రచ్చబండ కాడ ముచ్చట్లు పెడుతున్నారు. గతంలో ప్రతి రైతుకు ప్రయోజనం జరిగిందని, ఇప్పుడైతే కొద్ది మందికే రావడం ఏమిటని నోరెళ్ల పెడుతున్నారు.
అధికారంలోకి రాక మునుపు రైతులను రెచ్చగొట్టి రూ.2లక్షల లోపు రుణాలను తీసుకోవాలంటూ ఎగదోసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత రైతులను వంచించడం తగదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రుణమాఫీ కాని వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో, లబ్ధి పొందిన రైతులు స్వల్పంగానే ఉండడంతో.. ప్రభుత్వం చేసిన మోసాలపై గ్రామాల్లో చర్చ కొనసాగుతున్నది.
-నిజామాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రుణమాఫీతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోజనాన్ని దక్కించుకోవాలని చూసింది. రైతులకు ఏదో చేశామని చెప్పుకోవడానికి యత్నించింది. కానీ క్షేత్ర స్థాయిలో అమలైన రూ.లక్షలోపు రుణమాఫీతో రేవంత్ ప్రభుత్వ తీరు బట్టబయలు కావడంతో కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో రైతుల నుంచి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆగమాగమయ్యారు. రెండో విడుతలోనూ ఇదే దుస్థితి అధికార పార్టీకి ఎదురైంది. రైతుల్లో జోష్ కనిపించకపోవడంతో పాటు కర్షకుల నుంచి ఎదురవుతున్న తిట్ల దండకాన్ని తట్టుకోలేక చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు.
మాకెందుకు రుణమాఫీ రాలేదని రైతులు కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు పరుగులు తీస్తున్న ఘటనలు సైతం చాలా చోట్ల వెలుగు చూస్తున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. మొదటి విడుతలో ఒక రోజు ముందే వ్యవసాయ శాఖ వివరాలను వెల్లడించింది. కానీ రెండో విడుతలో మాత్రం వివరాల వెల్లడిలో గోప్యతను పాటించింది. రూ.లక్షలోపు మాఫీ సమయంలో భారీగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని భావించిన ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. గ్రామాల వారీగా రుణమాఫీ కాని వారే ఎక్కువగా ఉండడంతో రైతులంతా దుమ్మెత్తి పోశారు. ఈ నేపథ్యంలోనే రెండో విడుతలో రైతుల వివరాలు వెల్లడించకుండా కేవలం బ్యాంక్ అకౌంట్ల సమాచారాన్ని మాత్రమే వెల్లడించినట్లు తెలుస్తున్నది.
నాగిరెడ్డిపేట, జూలై 30: నాకు ఆత్మకూర్, రామక్కపల్లి శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నా పేరుమీద రూ.80 వేలు, మా భార్య పేరుమీద రూ.55 వేల రుణం ఉంది. మా భార్య పేరును మండలంలోని మరొకరి రేషన్ కార్డులో ఎంట్రీ చేయడంతో.. రుణమాఫీ కావడం లేదు. నా పేరుమీద ఉన్న రుణమైన అవుతుందనుకుంటే ఇప్పటికీ కాలేదు. రుణమాఫీ ఏందో గానీ ఆఫీసుల చుట్టూ తిరుగుడుకే సరిపోతుంది. ఏదో సాకు చెబుతూ.. డబ్బులు పడకుండా ఆపుతున్నారే తప్ప.. నేరుగా జమ చేసి రైతులకు లబ్ధి చేయడం లేదు.
– గౌరిగారి వెంకట్‌రెడ్డి, రైతు, ఆత్మాకూర్
పెద్దకొడప్గల్, జూలై 30: నేను 2021ల కెనరా బ్యాంక్‌లో రూ. 36,500 క్రాప్‌లోన్ తీసుకున్నా. రుణమాఫీ చేస్తారంటే సంతోషమైంది. మొదటి లిస్టుల పేరు రాలేదు. రెండోసారీ అయిన అత్తదనుకుంటే రాలే. ఏవో నదీముద్దీన్ సార్‌ను అడిగితే, మీ కుటుంబంల ఇతరులవి రెండు పేర్లు ఉన్నాయని చెప్పిండు. తప్పెవరిదో తెలియదు కానీ నాకు మాత్రం లోన్ మాఫీ కాలే.
-మెట్టు విఠవ్వ, మహిళా రైతు, పెద్దకొడప్గల్
బ్యాంక్‌లో లక్షా 40వేల లోన్ తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడుత ప్రకటించిన లిస్టులో నా పేరు లేదు. మా కుటుంబంలో నా ఒక్కడి పేరుపైనే క్రాప్ లోన్ ఉన్నది. అయినా నాకెందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఏమైందో అధికారులే చెప్పాలె. అందరికీ మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె.
– బెల్కంటి సాయిలు రైతు, పోచారం
నాకు లక్షా 40వేల క్రాప్‌లోన్ ఉన్నది. 2018 లో తీసుకొని ఏటా రెన్యువల్ చేస్తూనే ఉన్న. ప్రభుత్వమేమో రెండో విడుతలో లక్షా 50 వేల రుణమాఫీ అని చెప్పింది. రెండో విడుత రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. ఎవరినీ అడగాలో అర్థమైతలేదు. అధికారులను అడిగితే ఆగస్టు 15 వరకు రావచ్చని సమాధానం ఇస్తున్నరు. ఏం చెయ్యాల్నో తోస్తలేదు
– సుధాకర్, రైతు, అంబం, రుద్రూర్ మండలం