కాంగ్రెస్ సర్కారు రాకతో రైతాంగం కష్టాల్లో పడింది. పంట సాగుకు ముందే ఖాతాల్లో పెట్టుబడి సాయం పడే జమానా పోయింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పినట్లే రైతుబంధు పథకాన్ని రేవంత్ ప్రభుత్వం అటకెక్కించింది. తాము అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ గద్దెనెక్కాక కర్షకులకు మొండి‘చేయి’ చూపింది. ఇప్పటికే వర్షాకాలం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన సర్కారు.. యాసంగికి కూడా ఇచ్చేలా కనిపించడం లేదు. వివిధ సందర్భాల్లో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ఎకరానికి ఏటా రూ.15 వేలు పెట్టుబడి సాయం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయింది. రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్న రూ.10 వేలకు అదనంగా ఇస్తామంటూ గప్పాలు కొట్టిన రేవంత్ సర్కారు.. అమలు చేయడంలో మాత్రం విఫలమైంది. కనీసం కేసీఆర్ ఇచ్చినట్లు రూ.10 వేలు కూడా ఇవ్వలేక ‘చేతు’లెత్తేసింది. ఇప్పటికే వర్షాకాలంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ప్రభుత్వం.. యాసంగి మొదలై నెల గడిచినప్పటికీ ఆ ఊసే లేదు.
రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకం తెస్తామని ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లోనూ అదే చెప్పింది. కానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. దీంతో రైతులు మళ్లీ అప్పుల పాలవుతున్నారు. యాసంగిలో పంట సాగు చేసేందుకు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ చెప్పినట్లు పెంచకపోయినా కేసీఆర్ ఇచ్చినట్లు రూ.10 వేలు అయినా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కానీ అది పట్టించుకునే వారే కరువయ్యారు. మరోవైపు, నాలుగైదు రోజులుగా మంత్రులు రైతుభరోసాపై చేస్తున్న ప్రకటనలు గందోరగోళానికి గురి చేస్తున్నాయి. రైతుభరోసా కన్నా పంటకు బోనస్ ఇవ్వడమే మేలని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రే ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు మిగతా మంత్రులేమో రైతుభరోసా వేస్తామని చెబుతున్నారు. పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ సర్కారు అండగా నిలబడుతుందా? లేక వారి ఆశలపై నీళ్లు చల్లుతుందా? అన్నది వేచిచూడాలి.
రైతుభరోసా అమలు చేయాలంటే వ్యవసాయ శాఖ నుంచి ప్రకటన జారీకావాలి. కొత్తగా పట్టా పాస్‌బుక్కులు పొందిన వారి వివరాలను సేకరించేందుకు దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లబ్ధిదారుల జాబితా సరిచేయడానికి వ్యవసాయ శాఖకు చాలా సమయం పడుతుంది.
ఒకవేళ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి డిసెంబర్ మొదటి వారంలో ప్రక్రియ మొదలుపెట్టినా కొత్త సంవత్సరంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశముంది. సాగు సమయానికి అందాల్సిన పెట్టుబడి సాయం ఆలస్యంగా అందినా ప్రయోజనం ఉండదు. వడ్డీ వ్యాపారులకు వడ్డీలు చెల్లించేందుకే అందులోని సగం మొత్తం అప్పజెప్పాల్సి వస్తుంది. పంట కాలం మొదలైన కొద్ది రోజుల్లోనే రైతుభరోసా వంటి పథకాన్ని అమలు చేయాల్సిన సర్కారు మొద్దునిద్రలో ఉండడం సరికాదని రైతులు మండిపడుతున్నారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా కేసీఆర్ తెలంగాణలో రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా పంట సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించారు. 11 విడుతల్లో రూ.వేల కోట్లు పంపిణీ చేశారు. గుంట భూమి ఉన్న రైతును అర్హుడిగా పేర్కొంటూ రైతుబంధును అమలు చేశారు. కానీ, గతేడాది డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి పథకాల అమలులో కోతలు పెట్టేందుకే మొగ్గు చూపుతున్నది.
అర్హుల పేరిట ఎడాపెడా రైతులను పక్కన పెట్టి సగం మందికే సాయం చేయాలని యత్నిస్తున్నట్లు తెలిసింది. రైతుభరోసాపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ.. పథకానికి అర్హులెవరనే అంశాన్ని ఇంకా తేల్చనే లేదు. గతంలో రైతుబంధు కింద ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల మందికి కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. కాంగ్రెస్ రైతుభరోసా అమలు చేస్తే, అందులో సగం మందిని ఎగ్గొట్టే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్నది.