కామారెడ్డి/ కామారెడ్డి రూరల్/మాచారెడ్డి/ భీమ్గల్/ మోర్తాడ్/ సెప్టెంబర్ 11 : ఉమ్మడి జిల్లాలో రైతులను
యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఉదయం నుంచి యూరియా కోసం పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డులో బారులు తీరారు.
600 బస్తాల యూరియా అవసరం ఉండగా కేవలం 200 బ్యాగుల యూరియా మాత్రమే వచ్చింది. దీంతో అధికారులు శుక్రవారం లారీ లోడ్ వస్తుందని చెప్పి టోకెన్ ఇచ్చి పంపగా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరును నిరస్తూ సిరిసిల్ల రోడ్లోని గంజి గేట్ ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందించడం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా యూరియా దొరకడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు వారి వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.
భీమ్గల్ పట్టణంలో యూరియా కోసం మండలంలోని దేవక్కపేట్, కారేపల్లి, రాహత్నగర్, తాళ్లపల్లి, గంగరాయి, మెండోరా, బాబాపూర్ తదితర గ్రామాల నుంచి గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి వ్యవసాయ శాఖ కార్యాలయంలో టోకెన్లు ఇవ్వగా.. సొసైటీ గోదాము వద్ద బారులు తీరారు. సొసైటీకి వచ్చిన 750 బస్తాల యూరియా రాగా పోలీసు పహారా మధ్య ఒక్కో రైతుకు రెండుబస్తాల చొప్పున అందజేశారు. యూరియా స్టాక్ అయిపోవడంతో సాయంత్రం వరకు క్యూలో పెద్ద సంఖ్యలో నిల్చున్న రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత ఏర్పడడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై సందీప్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. రెండు రోజుల్లో యూరియా లోడు వస్తుందని మండల వ్యవసాయశాఖాధికారి లావణ్య చెప్పగా రైతులు అసహనంతో వెనుదిరిగారు. మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామంలో రైతులు యూరియా కోసంతెల్లవారుజాము నుంచే పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూలో ఉంచి పడిగాపులు కాశారు. దాదాపు 400 వరకు యూ రియా బస్తాలు అవసరం కా గా కేవలం 79 మాత్రమే వ చ్చాయని రైతులు తెలిపారు. గంటల తరబడి నిల్చున్నా యూరియా రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.