రామారెడ్డి, డిసెంబర్ 1: రైతు భరోసా వెంటనే ఇవ్వాలని మండలంలోని పోసానిపేట్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతు సంబురాలు చేసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకురావడంలేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని మండిపడ్డారు. ఇప్పటికే రెండు సీజన్లు ముగిసి మూడో పంటకు సిద్ధమవుతున్నా రైతుభరోసా జాడలేదన్నారు. సన్న వడ్లకు మాత్రమే కాకుండా అన్ని వడ్లకూ బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.