హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ):మున్సిపల్ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారు. తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌తోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో తన అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై అంచనాలు చెప్పలేకపోతున్నారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుందో చెప్పలేం’ అని వ్యాఖ్యానించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు గెలుస్తుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రచారంలో ఉన్నందున ఇంకా అంచనా వేయలేదంటూ సమాధానం దాటవేశారు. అయితే, గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ముందే లెక్కలు చెప్పానని, అవన్నీ నిజమే అయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63, సీపీఐకి ఒక సీటు వస్తుందని, కర్ణాటకలో కాంగ్రెస్‌కు 138 సీట్లు వస్తాయని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 240 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదని చెప్పానని, అప్పుడు దాదాపు తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని తెలిపారు. అయితే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుందో చెప్పలేకపోవడం ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే మంత్రులతో వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే సీఎం కచ్చితమైన లెక్కలు చెప్పడం లేదనే చర్చ జరుగుతున్నది.
ఎన్నికలు ఏకపక్షం కాదు.. త్రిముఖ పోటీ
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదంటూ నిన్నటివరకు ఎన్నికల ప్రచారంలో చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. తాజాగా బీఆర్ఎస్ పోటీలో ఉన్నట్టు అంగీకరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉన్నదని తెలిపారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌కు పోటీలేదని, ఏకపక్ష ఎన్నికలని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తాజాగా త్రిముఖ పోటీ ఉన్నదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. వృద్ధాప్య పెన్షన్ల పెంపుపై సీఎం చేదు వార్త చె ప్పారు. ప్రస్తుతానికి పాత పెన్షన్లే కొనసాగుతాయని, తర్వాత చూద్దామని తెలిపారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై దాటవేత
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై విలేకరులు ప్రశ్నించగా.. ఇప్పుడు కేవలం ఎన్నికల గురించే మాట్లాడుకుందామంటూ సమాధానం దాటేవేశారు. రేవంత్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ‘ఓటుకు నోటు కేసు’ ఆధారాలను దగ్ధం చేసేందుకే ఈ ప్రమాదం చేయించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినా, సీఎం స్పందించకపోవడం గమనార్హం. అలాగే రేవంత్‌రెడ్డి చేయించిన ఓ సర్వేలో కాంగ్రెస్‌కు చాలా తక్కువ మున్సిపాలిటీలు దక్కే అవకాశం ఉన్నట్టు వెల్లడైందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పార్టీ ముఖ్యనే త లతో అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.