హైదరాబాద్, ఫిబ్రవరి 9 ( నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం ముదురుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని.. తాము మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాఖ్యానించగా..తాము ఎవరి వల్లనో గెలువలేదని, కాంగ్రెస్ సొంత బలంతోనే గెలిచిందని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితాలను ప్రస్తావిస్తూ ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఎంఐంఎం మద్దతు ఇవ్వకపోయి ఉంటే గెలుపు సాధ్యమయ్యేది కాదు.. అధికారంలో ఎవరున్నా, వారు ఏ పార్టీ వారైనా మా వద్దకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు శ్రీధర్‌బాబు స్పందించారు. జూబ్లీహిల్స్‌లో తాము ఎవరి వల్లనో గెలువలేదని, కాంగ్రెస్ బలంతోనే గెలిచామని చెప్పా రు. తామే గెలిపించామని ఎవరైనా అనుకుంటే పొరపాటే’ అని కౌంటర్ ఇచ్చారు.