బచ్చన్నపేట, జులై 31 : ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శుక్రవారం జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఎద్దుగూడెం గ్రామంలో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
గ్రామంలో సాగు పరిస్థితులు, పంటల విస్తీర్ణం, దిగుబడులు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో వరి సాగు చేసినప్పుడు వచ్చిన ఆదాయం, ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల ద్వారా పొందుతున్న లాభాలపై రైతుతో చర్చించారు.
రైతుల అనుభవాలను ఇతర రైతులకు తెలియజేసి, వరి సాగుకు బదులుగా పెసర, నువ్వులు, కందులు, మిర్చి, బెండ, వాక్కాయలు వంటి ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
నీటి వినియోగం తక్కువగా ఉండే ఈ పంటలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలమని పేర్కొన్నారు. గ్రామంలో సమీకృత వ్యవసాయ (Integrated Farming) విధానాన్ని అనుసరిస్తున్న రైతు పరమేశ్వర్ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. డ్రమ్ సీడింగ్ పద్ధతిలో సాగు, వివిధ పంటల సమీకృత సాగు, ఆదాయ వనరుల వైవిధ్యీకరణ వంటి అంశాలను పర్యవేక్షించి, అభినందించారు.
వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో కలెక్టర్ మాట్లాడి, వారి ఉపాధి పరిస్థితులు, కూలీ వివరాలు తెలుసుకున్నారు. ఆరుతడి పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని కాపాడటంతో పాటు వ్యవసాయాన్ని స్థిరంగా కొనసాగించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ శాఖ అధికారులు శరత్ చంద్ర , సర్పంచ్ నర్సింగ రావు , రైతులు పాల్గొన్నారు.