కార్వాన్, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలపడంతో పోలీసులు వారిపై బలప్రయోగంతో ఇష్టారీతిగా వ్యవహరించారు. దీంతో పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం గుడిమల్కాపూర్ లక్ష్మీ నగర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న గుడిమల్కాపూర్ పోలీసులు ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు జీవన్ సింగ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా స్టేషన్మెట్లపై కార్యకర్తలతో కలిసి కూర్చున్న సమయంలో జీవన్ సింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోగా స్థానిక దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. దాదాపు మూడు గంటల చికిత్స అనంతరం తిరిగి గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యిందని పేర్కొన్నారు. దీంతో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు వారం రోజుల నుండి ప్రతి రోజూ ధర్నాలు, దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి రాస్తారోకో నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు తన పై దౌర్జన్యంగా దాడి చేసి పిడి గుద్దులు గుద్దినట్లు ఆరోపించారు. పోలీసుల దెబ్బల వల్లనే తాను గాయపడి కిందపడిపోయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంబటి శ్రీనివాస్, రాములు, ముత్యాల భాస్కర్, సోమాచారి, కనకరాజు, మంతటి నర్సింలు, జహంగీర్, నరేష్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుడు జీవన్ సింగ్ అనారోగ్యానికి గురి కావడంలో తమకు సంబంధం లేదని గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. అయితే ఎండ తీవ్రత వల్ల డీ హైడ్రేషన్ కారణంగా జీవన్ సింగ్ సొమ్మసిల్లినట్లు, తాము ఎవరిపై చేయి చేసుకోలేదని ఎవరిపై దాడి చేయలేదని వివరణ ఇచ్చారు.