సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ )/బంజారాహిల్స్ : తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన నీచపు వ్యాఖ్యలపై మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తీవ్ర నిరాశ నిసృ్పహలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, శ్రేణులు, కేసీఆర్ అభిమానులు భగ్గుమన్నారు. శంకర్ వైఖరిని నిరసిస్తూ ఎకడికకడ నిరసన ప్రదర్శనలు చేపట్టి, ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మహిళా నేతలు పెద్దఎత్తున గర్జించారు. తెలంగాణను సాధించి పెట్టిన నాయకుడిపై ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
శంకర్‌పై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో గ్రేటర్‌లోని బౌద్ధనగర్, ఎస్ఆర్నగర్, చిలకలగూడ, గాంధీనగర్ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఫిర్యాదులు చేశారు. అధికార మదంతో నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, ‘ఖబడ్దార్ శంకర్’ అంటూ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ప్రజా సంక్షేమం మరచి, దౌర్జన్యకర వ్యాఖ్యలకు దిగుతున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. శాసనసభ్యుడై ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ వైఖరిని నిరసిస్తూ గులాబీ దళం ఎకడికకడ నిరసన ప్రదర్శనలు చేపట్టి, ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దిల్‌సుఖ్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలంతా మూకుమ్మడిగా చేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు బాసటగా ఉంటామని పేర్కొన్న మహిళా నేతలు.. పోలీసులు, ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా తరలిన బీఆర్ఎస్ మహిళా నేతలు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళలపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే రేవంత్‌ను గద్దె దింపేందుకు మహిళలే చాలంటూ వారు హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రజల మనోభావాలను గౌరవించాలని వారు కోరారు. నిరసనలో మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్, ఎల్బీనగర్ నియోకవర్గం బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రంగేశ్వరి, సీనియర్ మహిళా నాయకురాళ్లు శైలజ, విజయలక్ష్మీ, పద్మ, మల్లిశ్వరి రెడ్డి, పార్వతి, రమాదేవి, అంజలి, లత, దేవి, మమత, శిల్పారెడ్డి, వాణి, సూరజ్యాద్దాని, కల్పన, లక్ష్మితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో మాజీ కార్పొరేటర్ సామల హేమ, బీఆర్ఎస్ నేతలు ఏఆర్. కృష్ణ ఇతర నాయకులతో పాటు చిలకలగూడ ఇన్స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణకు ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన శంకర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మాజీ కార్పొరేటర్ ఎన్. శేషుకుమారి అమీర్‌పేట్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎం. హనుమంతరావు, పార్టీ సీనియర్ నాయకులు గోపీలాల్ చౌహాన్, గుడిగె శ్రీనివాస్‌యాదవ్, నర్సింహ, వనం శ్రీనివాస్ తదితరులతో కలిసి ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సనత్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీకేగూడ చౌరస్తాలో శంకర్ దిష్టి బొమ్మ దహనంతో పాటు దాసారం బస్తీ కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బీకేగూడ చౌరస్తాలో పార్టీ నాయకులు రాజేశ్ ముదిరాజ్, వడ్డె కరుణాకర్‌రెడ్డి, పి.కుమార్, ప్రవీణ్‌రెడ్డి, రాజు, గుడిగె శ్రీనివాస్‌యాదవ్, బాల్‌రెడ్డి నిరసన తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. మంగళవారం ఉదయం షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శంకర్‌తో పాటు గతంలో పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఇదే తరహాలో మాట్లాడారని వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలున్నాయని అతడిపై బీఎన్ఎస్ 196, 351(3), 352,353, 61 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతల పాత్రపై సై తం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.