హైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ) : రెండు రోజులుగా శాసనసభ, శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి అధ్యాయమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మండలి మీడియా పాయింట్ వద్ద మంగళవారం రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఆయ న మాట్లాడారు. ప్రజాప్రతినిధులపైకి పోలీసులను ఉసిగొల్పి దౌర్జన్యాలకు పాల్పడిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక పిరికితనంతో పారిపోయిందని మండిపడ్డారు. సరిహద్దుల్లో బలగాలను మోహరించినట్టు వందలాది పోలీసులను అసెంబ్లీ వద్ద మోహరించి సభ్యులపై దాడులు చేయించడం హేయమని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే కక్షతో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, వారిని సభ నుంచి ఏకపక్షంగా బహిషరించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు, ఏకపక్ష బహిషరణ తీర్మానంపై తాము చర్చకు గట్టిగా పట్టుబట్టామని వెల్లడించారు. కానీ చర్చకు సమాధానం చెప్పుకోలేని అధికార పక్షం.. సభ్యులను మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరీక్షణలో ఉంచిందని మండిపడ్డారు. చివరికి మూడు నిమిషాల్లోనే సభను వా యిదా వేసి పరారైందని దుయ్యబట్టారు. శాసనమండలిలో ఇరవై మందికి పైగా సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను, కేవలం ఏడెనిమిది మంది సభ్యులు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పక్షం రాజకీయంగా తట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, తాతా మధు, నవీన్‌రెడ్డి, యాదవరెడ్డి, కోటిరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.