ఆ మహనీయుడిని స్మరించుకునే రోజు. తెలంగాణ భాషా దినోత్సవం. ఒకవైపు తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటుకుంటాం. మరోవైపు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై పాలన సాగించాల్సిన అత్యున్నత స్థాయి అధికారుల నియామక ప్రక్రియలో మాతృభాషా సామర్థ్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనే ప్రశ్న మాత్రం మిగిలిపోతున్నది. ప్రజలతో పాలనా వ్యవస్థ ఎంత దగ్గరగా ఉన్నది? అనేది మరింత కీలకమైన ప్రశ్న. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల్లో అత్యధికులు తమ సమస్యను మాతృభాషలోనే చెప్తారు. ప్రజల మాటను, భావోద్వేగాన్ని సదరు అధికారి అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే సమస్యకు పరిష్కారం లభించదు.
తెలంగాణ భాషా దినోత్సవం వేళ ఒక సహజమైన ప్రశ్న ఎదురవుతున్నది. ఒక సమర్థవంతమైన గ్రూప్-1 అధికారికి పరిపాలనా జ్ఞానం, రాజ్యాంగ అవగాహన, ఆర్థిక శాస్త్రం, చట్టాలపై పరిజ్ఞానం అవసరమైనప్పుడు భాషకు ప్రత్యేక పరీక్ష ఎందుకు? దానికి సమాధానం కూడా పాలనలోనే ఉన్నది. గ్రూప్-1 అధికారి పుస్తకాల్లోని సమాచారాన్ని మాత్రమే నిర్వహించరు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడాలి. అర్జీలను చదవాలి. నివేదికలను అర్థం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో విచారణలు నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించాలి. స్థానిక పరిస్థితులను పైస్థాయి అధికారులకు నివేదించాలి. కాబట్టి పరిపాలనా సందర్భంలో భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించగలరా? అనేదే ప్రధానంగా ఉండాలి. అధికారిక భాషా విధానం కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు ఏ భాషలో జారీ చేయాలన్న దానితో ముగియకూడదు. ఆ ఉత్తర్వులను చదివి, అర్థం చేసుకొని, క్షేత్రస్థాయిలో అమలు చేసే అధికారుల సామర్థ్యమూ దాని భాగమే కావాలి.
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో ప్రాంతీయ భాషను నిర్బంధ అర్హత పేపర్‌గా అమలు చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో యూపీఎస్సీ కూడా భారతీయ భాషల అర్హత పేపర్‌ను నిర్వహిస్తున్నది.
ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సైతం కేటాయించిన రాష్ట్ర భాష నేర్చుకోవడం చట్టబద్ధమైన నిబంధన. అయితే, మన రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తెలుగు భాష అర్హత పేపర్‌ను మినహాయించడం విచారకరం. విధానంలో సవరణ చేసి, 100 లేదా 150 మార్కులకు ‘తెలుగు నిర్బంధ అర్హత పేపర్”ను చేర్చాలి. ఇది కేవలం అర్హత మార్కులకే పరిమితం కాబట్టి మెరిట్ అభ్యర్థులకు ఎలాంటి నష్టమూ జరుగదు. పైగా స్థానిక అభ్యర్థులకు అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో పాలనా సమర్థత పెరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలోనూ భాష, యాస, సంస్కృతి, ఆత్మగౌరవం కీలకమైన ప్రతీకలుగా నిలిచాయి. అందువల్ల భాషా విధానం సహజంగానే రాజకీయ చర్చకు వస్తుంది. కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతమైన పరిపాలనా ప్రశ్నను ముందుకు తేవాలి.
ప్రజల భాషలో పాలన చేయగల అధికారి ఎవరికైనా నష్టం చేస్తారా? అలా అయితే ఆ నష్టం ఏంది? భాషా అర్హత వల్ల మెరిట్ తగ్గుతుందా? లేక ప్రజలతో పరిపాలనా సంబంధం బలపడుతుందా? ఇలాంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదీ, టీజీపీఎస్సీది. అర్హత పేపర్ చేర్చడం ఒక ప్రారంభం మాత్రమే. ఎంపికైన అధికారులకు శిక్షణ సమయంలో, స్థానిక మాండలికాలపై అవగాహన కల్పించాలి. తెలంగాణ పరిపాలనా పదజాలం, గ్రామీణ ప్రజలతో కమ్యూనికేషన్, తెలుగు ప్రభుత్వ ఉత్తర్వుల పఠనం, నివేదికల రచన, ప్రజా ఫిర్యాదుల విశ్లేషణ వంటి అంశాల్లో ప్రాయోగిక శిక్షణ ఇవ్వాలి. అంతేకాదు, భవిష్యత్తులో ప్రభుత్వ సేవల్లో ప్రత్యేక శిక్షణా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. అప్పుడు భాష పరీక్షలో పాస్ అయ్యే సర్టిఫికెట్‌గా కాకుండా, ప్రజా సేవకు అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యంగా మారుతుంది.
డిజిటల్ యుగంలో కూడా స్థానిక భాషా సామర్థ్యం విలువ తగ్గదు, దాని రూపం మాత్రమే మారుతుంది. కాళోజీకి నిజమైన నివాళి ఏది? ప్రతి సెప్టెంబర్ 9న కాళోజీని స్మరించుకోవడం, ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం, సభలు నిర్వహించడం సులభం. కానీ ఆయన సాహిత్యం, ఆయన లేవనెత్తిన ప్రజా ప్రశ్నలను పాలనా విధానాల్లోకి తీసుకొని రావాలి. ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చే సామాన్యులకు తన మాటను చెప్పడానికి మధ్యవర్తి అవసరం లేని వ్యవస్థను నిర్మించగలగాలి. పాలనలోకి బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష రావాలి. అదే నిజమైన నివాళి.
– (వ్యాసకర్త: తెలంగాణ యువ సమితి అధ్యక్షుడు)
– ప్రవీణ్ విప్లవ్ 81422 14326