హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం మంగళవారం నిర్బంధంలో చిక్కుకొన్నది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దుశ్శాసన పర్వంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రభుత్వం చూసింది. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తూ, మరోవైపు కాంగ్రెస్ శ్రేణులను వదిలివేయడంతో.. వారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై దాడికి తెగబడేందుకు సిద్ధమయ్యారు. ఈ పక్షపాత ధోరణిని ప్రశ్నిస్తూ.. అధినేతను కాపాడుకొనేందుకు వెళ్తున్న అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, పోలీసుస్టేషన్లకు తరలించారు. వారి అక్రమ అరెస్టులను నిరసిస్తూ, తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కదిలిన బీఆర్ఎస్ లీడర్లను, శ్రేణులను పోలీసులు నిర్బంధించారు.
సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నారాయణగూడకు తరలించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా అసెంబ్లీకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నేతలతో ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడి చేయించేందుకు ప్రభుత్వ పెద్దలు పథకం రచించారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రవల్లి నివాసం వైపు బయలుదేరారు. వారిని బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ జామ్ చేసి, వారిని ముందుకు వెళ్లకుండా నిరోధించి, అరెస్ట్ చేశారు. కేటీఆర్‌ను బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు, హరీశ్‌రావును జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు విడివిడిగా తరలించారు. తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించడం గమనార్హం. వారితోపాటు ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, సంజయ్, వివేక్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ అగ్రనేతల పోరాటానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు కదిలాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావును మోండా మారెట్ నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్‌ను ఆయన నివాసంలోకి పోలీసులు ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, కంచర్ల రామకృష్ణారెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, గొంగిడి సునీతా రెడ్డి సహా మరికొందరిని గృహనిర్బంధం చేశారు. కరీనంగర్‌లోని టూ టౌన్, త్రీ టౌన్ పరిధిలో పలువురు నేతలు, కార్యకర్తల అరెస్టులు జరిగాయి. హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నాకు వెళ్లనీయకుండా పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. పెద్దపల్లి-ధర్మారంలో ఉపసర్పంచులను, బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, కే పండుయాదవ్ తదితరులను అరెస్ట్ చేశారు. గజ్వేల్‌లోని ఎర్రవల్లి చుట్టూ భారీ పోలీసు బలగాలు మోహరించాయి. వంటేరు ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మారూక్ మండలంలో మాజీ ఎంపీపీ కృష్ణయాదవ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పండుగౌడ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మక్తల్, ధర్మారం, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి తదితర ప్రాంతాల్లో ముందస్తు అరెస్టులు/హౌస్ అరెస్ట్‌లు జరిగాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నారాయణగూడ, సైఫాబాద్, బోయినపల్లి, జవహర్‌నగర్, బేగంపేటలో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.