నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 8: అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సర్కార్ అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. సర్కార్, పోలీసులు తీరుపై మండిపడుతూ అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. వనపర్తిలో చేపట్టిన ఆందోళనలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబాబాద్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి నిప్పంటించారు.
భద్రాద్రి జిల్లా మణుగూరులో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి, నీళ్ల కుండలను పగులగొట్టి నిరసన తెలిపారు. హనుమకొండలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సూర్యాపేట, నల్లగొండ, కామారెడ్డి, జుక్కల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, కొత్తగూడెంతోపాటు అనేక చోట్ల ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.

మహబూబాబాద్‌లోని నెహ్రూ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తదితరులు

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం, పోలీసుల అనుచిత ప్రవర్తనను ఖండిస్తూ ఖమ్మం జిల్లా వేంసూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య