గడిచిన 32 నెలలుగా నిరీక్షించి, విసిగివేసారిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల సాధన కోసం ఈనెల 10న ‘చలో హైదరాబాద్’ పేరిట భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష మందితో ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా సభ జరుగుతుందని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ టీజీఈ జేఏసీ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, 6 డీఏలు (15.47%) విడుదల, పెండింగ్ బిల్లులు, పెన్షనర్ల బకాయిలు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, విధివిధానాలతో కూడిన హెల్త్‌కార్డుల అమలు, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు వంటివి ఈ ఆందోళనలో ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అనేక ఆశలు చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు వాటన్నింటినీ మరచిపోయింది. తమ ప్రభుత్వం కొలుదీరిన ఆరు నెలల్లోపే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తానని కాంగ్రెస్ నేతలు వాగ్దానం చేశారు. ఇప్పటికే ఉద్యోగులకు అమలు చేయాల్సిన కొత్త పీఆర్సీని సర్కార్ నాలుగు దఫాలుగా పొడిగించింది. పీఆర్సీ ఏర్పాటుకు ఉద్దేశించిన కమిషన్ గడువును ఈ నెలాఖరు వరకు మరోసారి పొడిగించింది. కొత్త పీఆర్సీని ప్రకటించే ఉద్దేశం లేక కావాలనే తాత్సారం చేస్తున్నదని విశదమవుతున్నది.
వాస్తవానికి 2028 జూలై 1 నుంచి మూడో పీఆర్సీ కమిషన్ కొలువుతీరాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన ఆరు డీఏ/డీఆర్‌ల (2024, 2025, 2026) మొత్తం కలిపితే 33.67% నుంచి 49.14% కి (15.47) అవుతుంది. (అంటే ఒక్కొక్క ఉద్యోగికి నెలకు దాదాపుగా రూ.15 వేల పైచిలుకు రావాల్సి ఉంటుంది). ఉద్యోగ విరమణ చేశాం. ఇక శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వ వైఖరి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇన్నాళ్లూ చేసిన ఉద్యోగం నుంచి విరమణ పొందామని ఆందోళన ఒకవైపు, వయసు కారణంగా వచ్చే అనారోగ్యాలు మరొకవైపు వారిని కుంగదీస్తున్నాయి.
నెలనెలా వచ్చే పెన్షన్ కనీస అవసరాలకు సరిపోయినా ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలతో బాకీలు, పిల్లల పెండ్లిళ్లు చేద్దామనుకున్న వారికి నిరాశ ఎదురవుతున్నది. ఏ బాదరాబందీ లేకుండా ఇంట్లో కూర్చుని మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపాల్సినవారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రోడ్డున పడి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే రిటైర్మెంట్ డబ్బులు రాక అనారోగ్యంపాలై, ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక 250 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. 2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు 25,453 మంది రిటైర్ కాగా ఒక్కొక్కరికి దాదాపు రూ.50 లక్షల నుంచి 60 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉన్నది. ప్రతినెలా దాదాపు 800 మందికి పైచిలుకు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ సంవత్సరం 9,7 19 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల ఒత్తిళ్లు, వివిధ సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం స్పందించి వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు ఇస్తామని చెప్పి, మే నెల నుంచి జూలై వరకు ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి జీపీఎఫ్, కమ్యూటేషన్ మాత్రమే చెల్లించింది. ఇంకా రావాల్సిన బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో పెండింగ్‌లో ఉండడం బాధాకరం. అవసరాల రీత్యా పెట్టుకున్న జీపీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఉద్యోగులకు భద్రత, భరోసా లేని సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని సర్కార్ భరోసా ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. ఇది ఉద్యోగుల డిమాండ్. పెన్షన్ అనేది ఎవరి దయాదాక్షిణ్యం కాదు. అది ఉద్యోగుల హక్కు.
పీఎఫ్ఆర్డీఏ చట్టానికి తగిన సవరణలు చేసి 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన అందరికీ ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్ (ఓపీఎస్) వర్తింపజేసి జీపీఎఫ్ ఖాతాలు కేటాయించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి ఉద్యోగీ బేసిక్ పే నుంచి 1.5 శాతం కంట్రిబ్యూషన్ మే, జూన్, జూలై, ఆగస్టు నెలల నుంచి కట్ చేసింది. ఈ కట్ చేసిన మొత్తానికి సమానంగా తమ వాటా చెల్లించేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేసింది. అయితే, ఆరోగ్య భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ఆదిలోనే హంసపాదులా మారింది. ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు, అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్త్‌కార్డు స్కీమ్ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ అనేక లోటుపాట్లతో సమస్య పరిష్కారం కావడం లేదు.
ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు, అపరిష్కృత సమస్యల సాధనకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా మూడవ దశ మహాసంగ్రామానికి పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యోగుల సహనాన్ని చేతగానితనంగా భావించకుండా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
– (వ్యాసకర్త: తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు)
కోహెడ చంద్రమౌళి 9441254983