గత కొంతకాలంగా ‘తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్’లో వరుస వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఈ వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ఆమె పదవిని తొలగిస్తూ.. ప్రస్తుత కార్యవర్గాన్ని కూడా ఫెడరేషన్ రద్దు చేయడంతో సుమలత, రఘు మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తనను అసభ్యకర పదజాలంతో దూషించారంటూ సుమలత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.
తాజాగా గురువారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ సమావేశం జరుగుతుండగా, సమావేశంలోకి సుమలత దూసుకొచ్చారు. దీంతో ఫిల్మ్‌ఛాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సమావేశానికి తనను అనుమతించలేదంటూ ఫెడరేషన్ నాయకులపై సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వివాదం చోటుచేసుకున్నది. తదనంతరం ఫిల్మ్‌ఛాంబర్ బయట సుమలత ఆందోళనకు దిగారు.