నకిరేకల్, అక్టోబర్ 1: రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే సిరిసిల్ల, సిద్దిపేటలపై కాదు…తెలంగాణ నుంచి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడుపై దండయాత్ర చేయు’ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సవాల్ విసిరారు. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం నకిరేకల్‌లో మీడియాతో మాట్లాడారు.
దేశం నుంచి వెళ్లిన ప్రతి భారతీయుడు విదేశాల్లో చిప్పలు తోముతున్నారని, బాత్రూమ్లు కడుగుతున్నారని అనడం రేవంత్‌రెడ్డికి తగదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్లినప్పుడు చిప్పలు తోమారా? బాత్రూమ్లు కడిగారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి .. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై విమర్శలకే సమయాన్ని కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌ను ఏమాత్రం అభివృద్ధి చేయని రేవంత్‌రెడ్డికి, కేటీఆర్‌తో పోల్చుకునే అర్హత లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చిరుమర్తి లింగయ్య స్పష్టంచేశారు.